నగరం పల్లెబాట పడుతోంది...

11:40 - January 13, 2018

హైదరాబాద్ : నగరం పల్లెబాట పడుతోంది. సంక్రాంతి  పండుగ సందర్భంగా నగరవాసులు సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ప్రయాణికుల రాకతో బస్‌, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే రద్దీకి తగ్గట్లుగా బస్సులు లేక ఇబ్బందులతో పాటు... అదనపు ఛార్జీలతో ప్రయాణికులపై భారం పడుతోంది.
సంక్రాంతి... పల్లెకు నగరం 
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగరం పల్లెకు తరలిపోతోంది. జంటనగరాల్లోని రైల్‌, బస్‌ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధాన టెర్మినల్‌ అయిన ఎమ్‌జీబీఎస్‌కు వచ్చే దారిలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జూబ్లీబస్టాండ్, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్ నుండి తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు బస్సులు ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రానికే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లే వారి కోసం టీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు నడుపుతోంది. 
టీఎస్ కు 1,910, ఏపీకు 1,352 బస్సులు 
నగరం నుండి తెలంగాణకు 1910 బస్సులు, ఆంధ్రప్రదేశ్‌కు 1352 బస్సులను టీఎస్‌ ఆర్టీసీ కేటాయించింది. పండగవేళలో అత్యంత రద్దీగా ఉండే మహాత్మాగాంధీ టెర్మినల్‌తో పాటు లింగంపల్లి, చందానగర్‌, ఇసిఐఎల్‌, ఎస్సార్‌ నగర్‌, అమీర్‌పేట టెలిఫోన్‌ భవన్ ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. ఇక రద్దీ ఎక్కువగా ఉన్నందున ఆన్‌లైన్‌ రిజర్వేషన్లకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  
ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోన్న ఆర్టీసీ
అయితే ఏటా పండుగలను టార్గెట్‌ చేస్తూ ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది ఆర్టీసీ. రెగ్యులర్‌ బస్సులతో పాటు 50 శాతం అదనపు ఛార్జీలతో నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ వెయిటింగ్‌ లిస్ట్‌ పరిమితి దాటింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. బస్సు, రైల్వే టికెట్లు దొరక్కపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. 
ప్రైవేటు ట్రావెల్స్‌కు చెక్‌ పెట్టేందుకు చర్యలు : ఆర్టీసీ ఆర్ ఎమ్ 
ఈసారి ప్రైవేటు ట్రావెల్స్‌కు చెక్‌ పెట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు రంగారెడ్డి ఆర్టీసీ ఆర్‌ఎమ్‌ యాదగిరి తెలిపారు. టెర్మినల్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులు ఆపకుండా ఉండేందుకు గట్టి ప్రణాళికలు రూపొందించామన్నారు. సొంత ఊరిలో పండుగను జరుపుకునేందుకు నగరవాసులు పయనమవడంతో నగరం ఖాళీ అవుతోంది. 

 

Don't Miss