నిరుద్యోగులకు చేయూతనందిస్తున్న పోలీసులు

18:51 - June 9, 2018

జగిత్యాల : పోలీసులు అంటే జనం భయపడే రోజులు మారాయి. క్రమంగా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతోంది. శాంతి భద్రతల పరిరక్షణలోనే కాదు ప్రజా సేవలో కూడా ముందుంటాం అంటున్నారు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి డివిజన్‌ పోలీసులు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను ఇచ్చి.. వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపుతూ... ఫ్రెండ్లి పోలీసులు అనిపించుకుంటున్నారు.

జగిత్యాల జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌, మెట్‌పల్లి డీఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో  పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు యువతకు ఈ ఉచిత శిక్షణ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఉద్యోగాల కోసం ప్రయత్నించే 120 మంది యువతకు మెట్‌లపల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో ఐదుగురు పీఈటీలతో శిక్షణ ఇప్పిస్తున్నారు పోలీసులు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రన్నింగ్‌, హై జంప్‌, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌ పోటీలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిపుణులతోప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ తీసుకునే యువతీ, యువకులకు దుస్తులు, షూతో పాటు మూడుపూటల భోజనం అందిస్తున్నారు.

కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఉచిత శిక్షణ వరంగా మారిందని యువతీ, యువకులు అంటున్నారు.  బయట ప్రైవెట్‌ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందాలంటే  సుమారుగా ఇరవై వేల నుంచి మూప్పై వేల వరకు  ఫీజులు వసూలు చేస్తున్నారని, అదనపు ఖర్చులు కూడా అధికం అని అంటున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణపై  నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. పట్టణంతో పాటు వివిద గ్రామాల నుంచి యువత తరలివచ్చి పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు.

Don't Miss