ఈ ఫిష్ తింటే ఫినిష్..

17:55 - January 10, 2017

వనపర్తి : చెరువులో చేపలు పెంచేటప్పుడు.. వాటికి మాంచి దాణా, ఫీడ్‌ వేయాలి. అప్పుడు అవి ఆరోగ్యంగా పెరిగి.. వాటిని ఆరగించిన వారికి కూడా ఆరోగ్యం చేకూరుతుంది. కానీ.. కొందరు చేపల పెంపంకందారులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారుల అలసత్వాన్ని అసరాగా చేసుకుని ప్రభుత్వం నిషేధించిన ఆహారాన్ని చేపల పెంపకంలో వినియోగిస్తున్నారు. ఫంగస్ చేపల పేరిట నిషేధిత చేపలను పెంచుతూ.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వైనం మహబూబ్‌నగర్‌ జిల్లాలో యథేచ్చంగా సాగుతోంది.

చేపలు కదా అని లొట్టలేసుకుని తింటే అవి ఆరోగ్యానికే హానికరం..
ఇదీ.. కొందరు మత్స్యకారులు అత్యాశతో చేపలు పెంచుతున్న తీరు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని రాంపురం, రంగాపురం, బునియాధిపురం, గుమ్మడం గ్రామ శివారుల్లో ఫంగస్‌ చేపల పెంపకం విపరీతంగా ఉంది. ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన వ్యాపారులు ఆయా గ్రామాల శివారుల్లో చెరువులను ఏర్పాటు చేసి ఫంగస్‌ చేపలను పెంచుతున్నారు. అయితే.. ఈ చేపలకు దాణా, ఫీడ్‌కు బదులు మాంసం వ్యర్థాలను ఆహారంగా వేస్తున్నారు.

వనపర్తి జిల్లాలో మాంసం వ్యర్థాలతో చేపల పెంపకం
ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ ఫిష్‌ను గతంలో కొందరు దొంగ చాటుగా పెంచుతూ చికెన్‌ వ్యర్థాలను వాటికి ఆహారంగా వాడేవారు. విషయం బయటకు పొక్కడంతో అప్పట్లో అధికారులు చేపల చెరువులపై దాడులు చేశారు. దీంతో చేపల పెంపకం దారులు సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. క్యాట్‌ఫిష్‌ నిషేధానికి గురవడంతో.. ఫంగస్‌ అనే మరో రకమైన చేపల పెంపకానికి తెరలేపారు. ఇలాంటి చేపల పెంపకానికి ఎలాంటి అనుమతులు లేకున్నా.. అనుమతులు ఉన్నాయని చెబుతూ.. ఫంగస్‌ ఫిష్‌ చేపలకు చికెన్‌ వ్యర్థాలను వాడుతున్నారు. ఈ మాంసం వ్యర్థాలను చేపలకు వేయడం వల్ల.. అవి విషపూరితంగా మారతాయని, వాటిని తినే మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

విషతుల్యమైన చేపలు పెంచుతున్నా.. పట్టించుకోని అధికారులు
వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూమిగా మార్చి.. చెరువులుగా తయారు చేసి చేపల పెంపకానికి రైతులు లీజుకు ఇస్తున్నారు. చేపల పెంపకం దారులు కూడా మొదట సాధారణ చేపలు పెంచుతామని చెప్పి... నిషేధిత చేపలు పెంచుతున్నారు. వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నా.. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి చేపల పెంపకం దారులపై దృష్టి సారించి అక్రమంగా ఫంగస్ చేపలు పెంచుతున్న చెరువులపై దాడులు చేయాలని, ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

Don't Miss