కన్నెర్రజేసిన పారిశుధ్య కార్మికులు

07:59 - May 16, 2018

హైదరాబాద్ : నిత్యం ఎంతో కష్టపడి నగరాన్ని శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు కన్నెర్ర చేశారు. తమకు వేతనాలు చెల్లించాలంటూ బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నెలంతా కష్టపడ్డా తాము  ప్రతినెలా జీతాల కోసం ఎదురుచూడక తప్పడం లేదని మండిడ్డారు. పని చేయ్యడానికి కనీస సౌకర్యాలు కూడ కల్పించేట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైన తమకు సకాలంలో వేతనాలు అందేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
మున్సిపల్‌ కార్మికులు ఆందోళన 
ఉద్యోగులు, కార్మికులు ఎవరైనా సరే నెల ప్రారంభమైందంటే చాలు.. జీతం కోసం ఆనందంతో ఎదురుచూస్తుంటారు. కానీ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పని చేసే కార్మికులు నెలంతా జీతాల కోసం ఎదురుచూస్తునే ఉంటారు. కార్మికులే కాదు, అధికారులు కూడా జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఉన్నతాధికారులకు మాత్రం ప్రతినెల 1వ తేదీనే జీతాలు తీసుకుంటున్నారు. కింది స్థాయి కార్మికులకు, ఉద్యోగులకు మాత్రం  అందించేందుకు కాలయాపన చేస్తున్నారు. దీంతో తమకు సకాలంలో జీతాలు చెల్లించాలని బల్దియా కార్యాలయం ముందు మున్సిపల్‌ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రతి నెల వేతనాలు ఆలస్యం అవుతుడటంతో ఇంటి అద్దెలు, నిత్యవసరాల కొనుగోలుకు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.
కార్మికులు మండిపాటు
గ్రేటర్‌ హైదరాబాద్‌ అందంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులు ఎంతో ముఖ్యం. రెండు రోజులు కార్మికులు సమ్మె చేస్తే చాలు రోడ్లపై నడవలేని పరిస్థితి నెలకొంటుంది. అలాంటి కార్మికులకు ప్రతినెలా రోడ్లు శుభ్రం చేసేందుకు చీపుర్లు, ఇతర పనిముట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇలాంటివేవి తమకు సకాలంలో అందటం లేదంటూ కార్మికులు మండిపడుతున్నారు. ఎంత పని చేసినా ప్రభుత్వం తమను గుర్తించటం లేదని ఆందోళన చెందుతున్నారు. పని చేస్తే వేతనాలు ఇవ్వక పోవడం.. పనులు చేయడానికి పనిముట్లు అరకోరగా ఉండటంతో అన్ని విధాల తాము ఇబ్బందులు పడుతున్నామని చెపుతున్నారు. తమకు కేసీఆర్‌ అనేక హామీలు ఇచ్చారని అందులో ఏహామీని అమలు చేయడం లేదని ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ప్రత్యేక ఆసుపత్రిలు ఏర్పాటు హామీలు ఎటుపోయాయని నిలదీశారు. తమకు పండుగ సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. 

 

Don't Miss