ప్రాజెక్టులపై పన్ను తగ్గించేది లేదు : జైట్లీ

17:57 - September 10, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ పనులపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తారనే వార్తలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జీఎస్టీ భారం తగ్గించేది లేదని హైదరాబాద్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ మీట్‌ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ తేల్చి చెప్పారు. పన్ను రేట్లను తగ్గించడం సరికాదని,.. ఇప్పటికే 18 శాతం ఉన్న పన్నును 12 శాతానికి తగ్గించామన్నారు. పన్ను తగ్గిస్తే... రాష్ట్ర ప్రభుత్వానికే నష్టమని సూచించారు.

9వేల కోట్ల మేర భారం
మోదీ, అరుణ్‌జైట్లీకి కేసీఆర్‌ లేఖలు రాశారు. ఆర్థికమంత్రి ఈటల కూడా పలు జీఎస్టీ సమావేశాల్లో అభ్యంతరాలను లేవనెత్తారు. 12 శాతం జీఎస్టీతో రాష్ట్రంపై 9వేల కోట్ల మేర భారం పడుతుందని... జీఎస్టీ మొత్తం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. కనీసం ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులకు మినహాయించాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ... అరుణ్‌జైట్లీ పన్ను తగ్గించేది లేదని తేల్చిచెప్పారు. పన్ను తగ్గించడం వల్ల కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకే మేలు జరుగుతుందే తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. అలాగే.. మీ లెక్కలు సరి చూసుకోండని సలహా ఇచ్చారు. దీంతో జీఎస్టీ తగ్గుతుందనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఆశలన్నీ అడియాశలయ్యాయి.

ఎలాంటి వ్యూహాలు
ఇదిలావుంటే... ప్రభుత్వం నిర్మించే పాఠశాలలు, ఇతర భవనాల విషయంలో పన్ను తగ్గించేలా పబ్లిక్‌ వర్క్స్‌ నిర్వచనాన్ని మారుస్తామన్నారు అరుణ్‌జైట్లీ. వచ్చే సమావేశం నాటికి దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులపై కూడా సానుకూల నిర్ణయం వస్తుందంటున్నారు ఈటల. మొత్తానికి ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపై జీఎస్టీ తగ్గించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనే ఆలోచనలో పడింది. మరి దీనిపై కేసీఆర్‌ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి. 

Don't Miss