ఆరోగ్యరంగంపై జీఎస్టీ తీవ్ర ప్రభావం

13:26 - August 26, 2017

విజయవాడ : కేంద్రం పేల్చిన జీఎస్టీ బాంబు..పేద, మధ్య తరగతి వర్గాలను అతలాకుతలం చేస్తోంది. అత్తెసరు జీతాలు, పూటగడవని దుస్థితిలో జీవితాలు నెట్టుకొస్తున్న బడుగుజీవులపై జీఎస్టీ గుదిబండగా మారుతోంది. నిత్యావసరాలపైనే కాకుండా వైద్య సేవలు, మందులపై జీఎస్టీ విధించడంతో...వారి పరిస్థితి మూలిగే నక్కమీద రోకలి పోటు చందంగా మారింది.

మందులపై 5 నుంచి 28 శాతం
ఔషధాలపై జిఎస్టీ విధించడంతో..సామాన్య రోగుల పరిస్థితి వర్ణానతీతంగా మారింది. మందులకు సంబంధించి నాలుగు రకాలుగా జీఎస్టీని అమలు చేస్తోంది కేంద్రం. ఆయా మందులపై 5 నుంచి 28 శాతం వసూలు చేస్తోంది. ప్రధానమైన మందులపై 28 శాతం పన్ను విధిస్తుండటంతో..పేద వర్గాలు మందులు కొనలేక, మంచంపైనే యాతన పడుతున్నారు. దీర్ఘకాలిక జబ్బులైన క్యాన్సర్, ఎయిడ్స్, టీబి, సుగర్, బిపి తదితర జబ్బులతో పాటు, అత్యవసర మందులపై 28 శాతం జీఎస్టీ భారం పడుతోంది. ఇవే కాక ల్యాబ్‌ కిట్లు, రక్త పరీక్షలు, వైద్య పరికరాలు జిఎస్టీ పరిధిలోకి రావడం...సామాన్య రోగులకు పెనుభారంగా మారిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలిక మందులు వాడుతున్న రోగులు..మధ్యలో వాటిని ఆపేస్తే వ్యాధి నిరోధకత తగ్గి కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

జీఎస్టీని మినహాయించాలి
మరోవైపు వైద్యరంగంపై జిఎస్టీని మినహాయించాలని ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యాలు కోరుతున్నాయి. జీఎస్టీ అమలుతో ఆసుపత్రుల నిర్వాహణ భారం మరింత పెరిగిపోయిందని వాపోతున్నారు. జీఎస్టీ బాదుడుతో ఆస్పత్రులు చెల్లించే పన్నులు

రోగుల నుంచే వసూలు చేయడంతో వారిపై అధిక భారం పడుతుందని చెబుతున్నారు. ఆమ్‌ ఆద్మీ సర్కార్‌గా చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం.. పేద రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైద్యరంగంపై జీఎస్టీని తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

Don't Miss