గల్లా అరుణకుమారి టీడీపీలో కొనసాగుతారా?

09:53 - June 12, 2018

చిత్తూరు : జిల్లాలో అధికార టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. ప్రత్యేకించి చంద్రగిరి నియోజకవర్గంలో ఆపార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. ఇప్పటి వరకు నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న గల్లా అరుణకుమారి పార్టీకి అంటీముట్టనట్టుగా ఉండడంతో... అటు పార్టీలోనూ... ఇటు క్యాడర్‌లోనూ అయోమయం నెలకొంది. ఇంతకీ చంద్రగిరి టీడీపీలో ఏం జరుగుతోంది? గల్లా అరుణకుమారి టీడీపీలో కొనసాగుతారా? లేక ఇతర పార్టీలో చేరుతారా? చంద్రగిరి రాజకీయంపై 10టీవీ కథనం....
రోజుకో మలుపుతు తిరుగుతున్న పాలిటిక్స్‌
చిత్తూరు అంటేనే సీఎం చంద్రబాబు సొంత జిల్లా. అందులోనూ చంద్రగిరి అంటే చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లె కొలువైన నియోజకవర్గం. అలాంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 
టీడీపీ దూరంగా ఉంటోన్న గల్లా అరుణ
గడిచిన మూడు ఎన్నికల్లోనూ చంద్రగిరిలో టీడీపీ ఓటమినే చవి చూసింది. చంద్రగిరిపై పసుపు జెండా ఎగిరి పదిహేనేళ్లు కావొస్తోంది. కాంగ్రెస్‌ నుంచి గల్లా అరుణకుమారి వరుసగా ఇక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత సీన్‌ రివర్స్‌ అయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ దెబ్బతినడంతో... గల్లా అరుణకుమారి టీడీపీ కండువా కప్పుకున్నారు.  2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగగా... ఆమె వైసీపీ చేతిలో ఓడిపోయారు. తన రాకను జీర్ణించుకోలేని టీడీపీలోని ఓ వర్గం తన ఓటమికి కృషి చేసిందని ఆమె మనస్తాపం చెందారు. అంతేకాదు.. కనీసం తనకు ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని కొంతకాలంగా ఆమె ఎదురు చూశారు. కానీ అదికూడా దక్కదని తేలడంతో ఆమె టీడీపీకి దూరంగా ఉంటున్నారు. పైకి ఆమె చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్నా... పార్టీ కార్యక్రమాలకు అంతంత మాత్రంగానే హాజరయ్యేవారు. ఈ పరిణామాలు అధిష్టానం దృష్టికి కూడా వెళ్లాయి.
రాజకీయాలకే గుడ్‌బై చెప్తానన్న గల్లా
అసలే టీడీపీలో అసంతృప్తిగా ఉన్న గల్లా అరుణకుమారికి.. పార్టీ వదిలిన ఓ లీక్‌ మరింత కోపాన్ని తెచ్చిపెట్టింది. గల్లా అరుణ ఈ దఫా చంద్రగిరి నుంచి కాకుండా పలమనేరు నుంచి పోటీ చేస్తారన్నది ఆ లీక్‌ సారాంశం.  పలమనేరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిని పుంగనూరుకు పంపాలని పార్టీ యోచిస్తోంది. ఈ పరిణామాలు అరుణకు స్వతహాగానే కోపం తెప్పించాయి. దీంతో చంద్రగిరి స్థానానికే కాదు... అసలు రాజకీయాలకే గుడ్‌పై బెప్పాలని ఆమె ఆ మధ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చంద్రబాబుకు కూడా చెప్పి... అదేరోజు అమెరికాకు వెళ్లారు. అయితే ఈ సమస్య అంతటితో ముగియలేదు. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ తమకే కావాలంటూ ఆమె.. నియోజకవర్గం అంతటా సమావేశాలు పెట్టారు.  అరుణకుమారే ఈ మీటింగ్‌లు పెట్టిస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది.  ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ఆమె... పార్టీ కేడర్‌తో సమావేశమయ్యారు. పార్టీలో కొంతమంది తనకు ద్రోహం చేస్తున్నారని చెప్తూనే... టీడీపీని వీడబోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఇంచార్జీగా కూడా తనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. 
గల్లా అరుణపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
చంద్రగిరి నియోజకవర్గంలోని మరోవర్గం ఆమె నిర్ణయంపై గుర్రుగా ఉంది. పార్టీ కోసం పనిచేయరుకానీ... పార్టీ టికెట్‌ తనకే కావాలంటే ఎలా అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఊహించని పరిణామాలతో చంద్రబాబు అయోమయంలోపడ్డారు. చంద్రగిరి రాజకీయాలు ఆయనకు తలనొప్పి వ్యవహారంగా మారింది. అయితే 2019 ఎన్నికల్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది... అంతిమంగా అక్కడ నుంచి పోటీ చేసేది ఎవరన్నది చివరకు ఎలా ముగుస్తుందోన్న ఆసక్తి జిల్లా అంతగా నెలకొంది. 

 

Don't Miss