ఘనంగా గండికోట ఉత్సవాలు

19:30 - January 21, 2018

కడప : చరిత్రకు సజీవ సాక్ష్యం గండికోట దుర్గం. అద్భుత శిల్పకళా నైపుణ్యం దాని సొంతం.  ఓ వైపు లోయలో సుడులు తిరుగుతూ హొయలు పోయే పెన్నా నదీ ప్రవాహం... మరోవైపు ఒడ్డున శతృ దుర్బేద్యమైన కోట దుర్గం. చూపరులకు రెండు కళ్ళూ చాలవు అనిపించే అద్భుత శిల్ప కళా కావ్యం. నేటి నుంచి మూడు రోజులపాటు  ఇక్కడ ప్రభుత్వం ఉత్సవాలను  నిర్వహిస్తోంది... గండికోట ఘనచరితపై  టెన్‌టీవీ ప్రత్యేక కథనం....
మరో హంపీగా గుర్తింపుపొందిన గండికోట
పూర్వం ఎందరో రాజుల ఏలుబడిలో...  దశదిశలా కీర్తిని చాటుతూ... ఓ వెలుగు వెలిగిందీ గండికోట. మరో హంపీగా ప్రశంసలు పొందిన గండికోట... అద్భుత కట్టడాలు, శిల్పకళా నైపుణ్యం, తాగునీటి చెరువులు, కోనేరులతో అలరారింది. కరవుకాలాల్లో ఆహార కొరత తీర్చేందుకు ఇక్కడ ధాన్యాగారం కూడా నిర్మించారు. ఏనుగులు ఢీ కొట్టినా కదలని ధృడమైన సింహద్వారాలు,  పెన్నాలోయ సోయగం ఇలా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 
క్రీస్తుశకం 1123 జనవరి 9న గండికోట నిర్మాణం
కడప జిల్లాకే తలమానికం గండికోట... జమ్మలమడుగుకు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని క్రీస్తు శకం 1123లో జనవరి 9న నిర్మించినట్టు గండికోట కైపియత్‌ ద్వారా తెలుస్తోంది. మొదట పెమ్మసాని రాజుల ఆధీనంలోనూ...  తర్వాత విజయనగర ప్రభువులు, గోల్కొండ నవాబులు, మైసూర్‌ రాజుల తర్వాత ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది.
గండికోట అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ఈ నేపథ్యంలో గండికోటను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు  ముందడుగు వేసింది ఏపీ ప్రభుత్వం...  గతేడాది ఉత్సవాలను మొదలు పెట్టిన ఏపీ ప్రభుత్వం...ఇక ప్రతియేటా నిర్వహిస్తామని ప్రకటించింది.
నేటినుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు
నేటినుంచి  మూడు రోజుల పాటు ప్రభుత్వం గండికోట ఉత్సవాలు నిర్వహిస్తోంది. వాటి ప్రచారంలో భాగంగా.. కడప నగరంలో కళాకారులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కృష్ణా కూడలి నుంచి ప్రారంభమైన  ర్యాలీని జాయింట్‌ కలెక్టర్‌  ప్రారంభించారు. ఈ సందర్భంగా చేసిన నృత్య, కళా ప్రదర్శనలు   ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరు ఈ ఉత్సవాల్లో పాల్గొని  గండికోట వైభవాన్ని నలుదిశలా చాటిచెప్పేందుకు ముందుకు రావాలన్నారు జాయింట్‌ కలెక్టర్‌ శ్వేతా తీయోటియా. ప్రదర్శన లో ఆకట్టుకున్న కళాకారులను జేసీ ప్రత్యేకంగా అభినందించారు.
మౌళిక సదుపాయాలపై సందర్శకుల అసంతృప్తి 
గండికోట గురించి సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న ఔత్సాహికులు... కోటను సందర్శించేందుకు వస్తున్నారు. అమెరికన్‌ గ్రాండ్‌ కేనియన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందంటున్నారు. ఉత్సవాల ఏర్పాట్లకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ... పర్యాటకులకోసం మౌళిక సదుపాయాల కల్పనలో ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతమెంతో ఘన చరిత్ర గల వారసత్వ సంపదలు శిథిలావస్థకు చేరి... కాలగర్భంలో కలుస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యంతో చరిత్ర పుటలకే పరిమితం అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారసత్వ ఉత్సవాలు నిర్వహించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

Don't Miss