ఘనంగా గీతం యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవం

20:34 - November 8, 2017

విశాఖ : విద్యాకుసుమాలను పట్టభద్రులుగా తీర్చిదిద్దుతోన్న గీతం యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. భారతప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్నాతకోత్సవం సందర్భంగా 1500 మంది విద్యార్థులకు స్నాతకోత్తర డిగ్రీలను, బంగారు పతకాలను, 27 మంది రీసెర్చి స్కాలర్లకు పిహెచ్‌డీ పట్టాలను ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. 
గీతం విశ్వవిద్యాలయంలో పండగ వాతావరణం 
గీతం విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవంలో భాగంగా విశ్వవిద్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు, విద్యార్థులతో గీతం యూనివర్సిటీ కళకళలాడింది. ఈ సందర్బంగా  ప్రోపెసర్ అశుతోష్ శర్మ గీతం చాన్సలర్‌కు గౌరవ డాక్టరెట్ అందించారు. వారితో పాటు టాటా మెమోరియల్ హాస్పటల్ డైరక్టర్ డాక్టర్ రాజేంద్రఅచ్చుత్ బద్వేకు డాక్టర్ ఆఫ్ సైన్స్‌, ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుకు డాక్టర్ ఆఫ్ లెటర్స్‌ను గీతం చాన్సలర్ అందించారు.
గీతం యూనివర్సిటీకి నాక్‌ ఏ+ గ్రేడ్‌ 
గీతం యూనివర్సిటీకి నాక్‌ ఏ+ గ్రేడ్‌ రావడంతో పాటుగా దేశంలోనే తొలిసారిగా ఫిన్‌టెక్‌ అకాడమీని గీతంలో ప్రారంభించామని విసి తెలిపారు. దాంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. దాదాపు 15వేల పై చిలుకు విద్యార్థులు, 11 వందల మంది పరిశోధక విద్యార్థులు గీతంలో విద్యాభ్యాసం చేస్తున్నట్లు వెల్లడించారు. బోధనతో పాటుగా పరిశోధనలను ప్రోత్సహించేవిధంగా 150కి పైగా భారీ పరిశోధనా ప్రాజెక్టులను గీతం చేపట్టడం విశేషమని తెలిపారు. స్థానిక పరిశ్రమలకు కన్సల్టెన్సీ సేవలను సైతం అందిస్తూ గీతం తన ప్రత్యేకతను చాటుతోందన్నారు. 
విద్యార్థులంతా దేశ ప్రతిష్టకు నడుం బిగించాలని : అశుతోష్ శర్మ
పట్టభద్రులవుతున్న విద్యార్థులంతా దేశ ప్రతిష్టకు నడుం బిగించాలని సూచించారు ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ. రక్షణ పరిజ్ఞానం, సమాజహితానికి వినియోగిస్తున్న తీరు, స్వావలంబన, మేకిన్‌ ఇండియాల ఆవశ్యత, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నాణ్యమైన విద్య వంటి అంశాలను వివరించారు. ప్రపంచంలో మొదటి 5 సైంటిఫిక్‌ పవర్‌ దేశాలలో భారత్‌ను ఒకటిగా చేసేందుకు ప్రభుత్వం సైన్స్‌, టెక్నాలజీ ఇన్నోవేషన్‌ విధానాన్ని అమలులోకి తీసుకువస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలను ఆకర్శించేందుకు వజ్ర పేరిట కొత్త పథకాన్ని ప్రవేశ పెడుతుందన్నారు. చంద్రయాన్‌, మంగళయాన్‌ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు.  
సత్కారం అందుకోవడం ఆనందంగా ఉంది : గొల్లపూడి 
గాంధీ పేరుమీద నెలకొల్పి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న విశ్వవిద్యాలయం నుండి సత్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు గొల్లపూడి మారుతీరావు. గాంధీజీ పేరుమీద నెలకొల్పి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న విశ్వవిద్యాలయం నుంచి ఈ సత్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశానికే పేరు తెచ్చిన అబ్దుల్‌ కలాం గురించి ప్రస్తావించారు. ప్రతి ఒక్క విద్యార్థి మరో అబ్దుల్‌ కలాంలా కావాలన్నారు. పరిశోధనలతో పాటు విలువలు కూడిన విద్య అవసరం అన్నారు. గీతం నుండి డిలిట్‌ అందుకోవడంతో తాను కూడా డాక్టర్‌ అయ్యాను అని చమత్కరించారు. 
ప్రోత్సహించేందుకు కృషి : రాజేంద్రఅచ్యుత్‌ బద్వే 
విద్యార్థులలో అంతర్గతంగా ఉన్న చిన్న చిన్న ఆలోచనలను వెలికి తీసి ప్రోత్సహించేందుకు కృషి చేయాలన్నారు డాక్టర్‌ రాజేంద్రఅచ్యుత్‌ బద్వే. అలాంటి విద్యార్థులే రాబోయే రోజులలో మేధావులుగా తయారవుతారని తెలిపారు. ప్రస్తుత ప్రపంచంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి పథంలో ఉందని, ఇంట్లో కూర్చొని ముబైల్‌ ద్వారా ప్రపంచంలోని విశేషాలను వీక్షిస్తున్నామన్నారు. ఒక్కో రంగంలో ఒక్కోవిధంగా నూతన ఒరవడి వస్తోందని, అకడమిక్‌ ప్రాముఖ్యతతో పాటు నైతిక విలువలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. 
డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉంది : పద్మ 
గీతం విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు బెస్ట్ రీసర్చర్ పద్మ. గీతం ప్రతి సంవత్సరం బెస్ట్ రీసర్చ్‌ అవార్డు ప్రకటిస్తుందని, ఈ సారి ఇంటర్‌ నేషనల్‌ బిజినెస్‌లో పరిశోధనకు గాను తనకు ఈ అవార్డు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 
అనుభవాలు పంచుకున్నారు 
వివిధ విభాగాల్లో డిగ్రీలు అందుకున్న విద్యార్థులు యూనివర్సిటీలో తమ అనుభవాలను పంచుకున్నారు. గీతం లాటి డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో తాము డిగ్రీ పొందడం అదృష్టంగా ఉందన్నారు. వర్సిటీని వదిలి వెళ్లడం బాధగా ఉన్నా మంచి ఉద్యోగంతో బయటకు వెళ్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. మొత్తం మీద 8వ స్నాతకోత్తర వేడుక పండుగ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థుల కేరింతలతో, ప్రముఖుల ఉపన్యాసాలతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. 

 

Don't Miss