స్వాతంత్ర వేడుకలకు సిద్ధమైన గోల్కొండ

08:21 - August 13, 2017

హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట రెడీ అవుతోంది. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లు శరవేగంగా జరగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు ఇప్పటికే గోల్కొండ కోటను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గోల్కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విస్తృతంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు స్క్వాడ్స్‌, పోలీసు జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు. గోల్కొండ కోటకు సుమారు రెండు కిలోమీటర్ల మేర పోలీసులు నిఘా పెట్టారు. స్వాతంత్ర్య వేడకుల కోసం దాదాపు 5వేల మంది పోలీసులు కోటపై మోహరించారు. డీసీపీలు, ఏసీపీలు, సీఐలతోపాటు ఎస్సైలు, కానిస్టేబుల్స్‌, హోంగార్డులో బందోబస్తులో పాల్గొంటున్నారు. కేవలం హైదరాబాద్‌ పోలీసులే కాదు.... జిల్లాల్లోని పోలీసు సిబ్బందికీ డ్యూటీలు వేశారు. వేడుకల్లో పాల్గొనే వీఐపీలు, వీవీఐపీలు , మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. త్రివర్ణ పతాకావిష్కరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. 

వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు 
వేడుకలు నిర్వహించే ప్రాంతంలో ప్రత్యేకంగా విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. రాత్రిపూట అవి జిగేల్‌మంటూ ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్‌దీపాల వెలుగుల్లో గోల్కొండ కోట కాంతులీనుతోంది. కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనే విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీని పోలీసులు ఏర్పాటు చేశారు. వీఐపీలు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Don't Miss