తేనె..ఔషధగుణాలు..

11:47 - August 22, 2017

ప్రకృతి ప్రసాదించిన వరాల్లో సహజ సిద్ధమైన ఔషధం 'తేనె' ఒకటి..చక్కెర తియ్యగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి హానికరం. తేనె కూడా తియ్యగానే ఉంటుంది. కానీ ఔషధభరితం. ఎందుకంటే పూలల్లోని మకరందం, పుప్పొడి పరిమళం కలగలిసిన అద్భుతమైన రుచి దీని సొంతం. అందుకే తేనె మధురాతి మధురం... అమృతాన్ని మరిపించే దివ్యౌషధం. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు పది వేల సంవత్సరాల మొదలు, యాభై వేల సంవత్సరాల ముందునుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవి చూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. నిజానికి తేనెటీగ జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్తజ్ఞ్రుడు హ్యూబర్‌కు దక్కుతుంది.

తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచినీ సుగంధాన్నీ వెదజల్లుతుంది. యూకలిప్టస్‌, నిమ్మ జాతి పూల తేనె ఘాటైన రుచినీ వాసననీ కలిగి ఉంటుంది. అందుకే బేకింగ్‌ ఉత్పత్తుల్లో చక్కెరకు బదులు తేనె వాడటంవల్ల అవి మరింత రుచిగానూ సువాసనభరితంగానూ ఉంటాయి.

వూబకాయంతో బాధపడేవాళ్లకు క్రమం తప్పకుండా 30 రోజులపాటు రోజూ 70 గ్రా. తేనెను ఇచ్చి చూడగా వాళ్ల బరువులో 1.3 శాతం తేడా ఉండగా కొలెస్ట్రాల్‌ మాత్రం మూడు శాతం వరకూ తగ్గిందట. తేనెలో నిమ్మరసం, దాల్చినచెక్క పొడి కలిపి తీసుకున్నా బరువు తగ్గుతారు. అంతేకాదు, తేనెని గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవడంవల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు త్వరగా జీర్ణమవుతాయి.

ముడి తేనె బీపీని తగ్గిస్తుందన్నది మరో పరిశోధన. అంతేకాదు, శరీరంలో ఇన్సులిన్‌ శాతాన్నీ క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలో చక్కెరనిల్వలు తగ్గకుండా చూస్తుంది. వ్యాయామం తరవాత దీన్ని తీసుకోవడంవల్ల అలసట ఉండదు.

యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు అధికంగా ఉండే తేనె మంచి యాంటీసెప్టిక్‌ కూడా.

తేనెలోని న్యూట్రాసూటికల్స్‌ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీరంలో హానికరమైన ఫ్రీ-రాడికల్స్‌ను తొలగిస్తాయి. దాంతో క్యాన్సర్‌, హృద్రోగాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.

తేనె పుండ్లనీ గాయాలనీ త్వరగా తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలవల్ల ఇది ఆటోలిటిక్‌ డెబ్రిడిమెంట్‌గా పనిచేస్తుంది. పుండ్ల నుంచి వచ్చే చెడువాసనని తొలగిస్తుంది. పచ్చిగాయాలమీద ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే మాంఛెస్టర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు క్యాన్సర్‌ రోగులకు శస్త్రచికిత్స అనంతరం తేనెను వాడే ఆలోచనలో ఉన్నారు.

మచ్చల్ని మాయం చేయడంలో తేనెని మించింది లేదు.

స్థానికంగా దొరికే తేనెను తాగడంవల్ల అలర్జీలు త్వరగా రావట. తేనెటీగలు చుట్టుపక్కల మొక్కల నుంచే తేనెను సేకరించడంవల్ల ఆ పరాగరేణువులు శరీరంలో చేరి రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

Don't Miss