శ్రీకాకుళంలో మనసున్న శ్రీమంతుడు

10:33 - January 4, 2017

శ్రీకాకుళం :మానవ సేవే మాధవ సేవ అన్న మాటలను నిజం చేస్తున్నాడు శ్రీకాకుళానికి చెందిన జగన్నాధస్వామి. పేదోళ్ల ఆకలి తీర్చేందుకు కంకణం కట్టుకున్నాడు. ఆకలి బతుకుల్లో ఆనందాలు నింపుతున్నాడు.

సుమారు 30మంది కడుపు నింపుతున్న..

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం వావివలసలో జగన్నాధ స్వామి....పేరు చెబితే పేదల ముఖంలో ఆనందం కనిపిస్తుంది. రోజూ సుమారు ముప్పై మందికి...నెలలో చివరి ఆదివారం సుమారు మూడు వందల మంది పేదలకు కడుపు నింపుతాడీ మనసున్న మారాజు. అందుకే ఈయనంటే అక్కడివారికి అభిమానం.

తనకున్న స్థలంలో ఓ చిన్న గదిని నిర్మించి...

తనకున్న స్థలంలో ఓ చిన్న గదిని నిర్మించి...అందులో అన్నదాన కార్యక్రమమే కాదు...రామాయణ, మహాభారతం గాధలను వినిపించే ఏర్పాట్లు చేసాడు. ఇంత చేస్తున్న ఇతనేదో ధనవంతుడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల్లో సైకిల్‌ మీద అప్పడాలు, ఒడియాలు అమ్ముకుంటూ వచ్చే డబ్బులతోనే...16 సంత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు.

మాత్రం గొప్పలు చెప్పుకోని జగన్నాధ స్వామి...

అయితే తాను చేస్తున్న సేవపై జగన్నాధ స్వామి మాత్రం గొప్పలు చెప్పుకోడు. పెద్దలు, గురువుల హితబోధతోనే తానీ సేవ చేస్తున్నానని అంటున్నాడు. పరుల సేవతో వచ్చే తృప్తి ఎంత సంపాదించినా రాదని గర్వంగా చెప్తున్నాడు. తాను బతికున్నంత వరకూ ఈ సేవ ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాడు.

గ్రామంలోని పేదలంతా హర్షం....

జగన్నాధ స్వామి అన్నదానం కార్యక్రమంపై ఈ గ్రామంలోని పేదలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని చూస్తేనే మంచి ఇంకా బతికుందనే విషయం గుర్తుకొస్తుందని అంటున్నారు. స్వార్థపు ఆలోచనలతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఎంతోమంది స్వార్థపరులకు.. జగన్నాధస్వామి సేవే ఆదర్శం కావాలి. 

Don't Miss