అమరావతిలో ఉద్యోగులకు సొంత ఇళ్లు

16:56 - February 17, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలివచ్చిన ఉద్యోగుల కల నెరవేరబోతోంది. ఉద్యోగులతో పాటు అధికారులు, జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం సొంత ఇళ్లను మంజూరు చేయనుంది. ఇందుకు సంబంధించిన భూ కేటాయింపులపై సీఆర్డీఏ అధికారులకు సూచనలు కూడా చేసింది. 
ఉద్యోగులపై చంద్రబాబు వరాల జల్లు 
ఏపీ రాజధాని అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఉద్యోగులకు అమరావతి ప్రాంతంలో సొంత ఇళ్లు కట్టించనున్నారు. ఉద్యోగులతో పాటు అధికారులు, జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్లాట్లు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం తగిన స్థలం నిర్ణయించాలని సీఆర్డీఏ అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
తక్కువ వ్యయం, ఎక్కువ నాణ్యతతో నిర్మాణం 
ప్రభుత్వం నిర్మించనున్న ఈ గృహ సముదాయాలను అత్యంత తక్కువ వ్యయం, ఎక్కువ నాణ్యతతో నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు.   మొత్తం ఐదు కేటగిరిల్లో జి ప్లస్ 8 విధానంలో అపార్టుమెంట్లు నిర్మించనున్నారు. మొదటి కేటగిరిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలు, ఆల్ ఇండియా సర్వీసస్ అధికారులు, రెండు, మూడు కేటగిరిల్లో గెజిటెడ్ అధికారులు, నాలుగవ కేటగిరిలో నాన్ గజిటెడ్ అధికారులు, ఐదవ కేటగిరిలో క్లాస్ ఫోర్ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లకు కేటాయించే విధంగా ప్రతిపాదనలు తయారు చేశారు.  
ఉద్యోగులు పూర్తి స్థాయిలో సంతృప్తి
దీనిపై ఉద్యోగులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయటంలేదు. తమకు సొంత ఇళ్లు నిర్మాంచే వ్యవహారంపై ఇంతవరకు తమతో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చర్చించలేదని ఉద్యోగసంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లు కాకుండా.. ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని కోరుతున్నారు.  ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు.. అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా నివాస స్థలం కల్సించాలని ఎన్జీవో నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 
మళ్లీ లబ్ధి పొందే వారిపై విమర్శలు 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌లోనూ ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలు తీసుకుని లబ్ధి పొందారని.. అలాంటి వారు మళ్లీ అమరావతిలోనూ లబ్ధి పొందే అంశంపై విమర్శలు వస్తుడడంతో దీనిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.

 

Don't Miss