'ఏపీ ప్రభుత్వం దళిత వ్యతిరేకి'....

21:09 - January 13, 2018

గుంటూరు : జిల్లా తాడికొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొట్టిపాడు దళిత బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో... కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని.. దాడికి పాల్పడిన అగ్రకుల పెత్తందారులపై కేసులు పెట్టకుండా బాధితులపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం దళిత సమస్యలను పరిష్కరించకపోతే 'చలో గొట్టిపాడు' నిర్వహిస్తామని నేతలు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ అండదండలతో ఎక్కడో ఓ చోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అధికారం ఉందనే అహంభావంతో కొందరు తరుచూ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా పెదగొట్టిపాడులో ఇలాంటి ఉదంతమే వెలుగుచూసింది. దళితులపై అగ్ర కులానికి చెందిన పలువురు దాడులు చేశారు. ఇదేమని ప్రశ్నించిన దళితులపైనే కేసులు బనాయించి అరెస్ట్‌ చేయడం వివాదాస్పదమైంది.

పెదగొట్టిపాడులో బాధిత దళితులను పరామర్శించేందుకు వామపక్ష, దళిత సంఘాల నేతలతో సంఘీభావ కమిటీ ఏర్పడింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నేతలు గ్రామ పర్యటనకు బయల్దేరారు. అయితే.. గుంటూరులోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు... పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా లాక్కెళ్లి... వాహనాలు ఎక్కించారు. దీంతో పోలీసులు, సీపీఎం, దళిత సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. అరెస్ట్‌ నేతలను వివిధ పీఎస్‌లకు తరలించారు. మధును తాడికొండ పీఎస్‌లో దాదాపు 5 గంటలపాటు నిర్బంధించారు.
రాష్ట్రంలో దళిత వ్యతిరేక పాలన సాగుతుందని మధు ఆరోపించారు. దళితులపై దాడులు జరిగితే పరామర్శించని పాలకులు... బాధితులకు అండగా నిలిచిన నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దాడి చేసినవారిపై 307 సెక్షన్‌ కింద అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులపై పెట్టిన అక్రమ కౌంటర్‌ కేసులు ఎత్తివేయాలని, అత్యాచారాల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. దళితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం సాగుతుందని హెచ్చరించారు. దళితులకు న్యాయం కోసం ఈనెల 23 లేదా 24న... 36 వామపక్ష, ప్రజా, దళిత సంఘాలతో 'చలో గొట్టిపాడు' నిర్వహిస్తామన్నారు.

ఇక పీఎస్‌లో ఉన్న మధుతో పాటు... పలువురు సీపీఎం నేతలను రాష్ట్ర కార్యవర్గసభ్యులు సీహెచ్‌ బాబూరావు పరామర్శించారు. ప్రభుత్వం దళిత సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. బాధితులకు అండగా ఉండకుండా... దాడులు చేసిన అగ్రకులాలకే వంతపాడడం దారుణమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి దళితులకు న్యాయం చేయకపోతే.. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు బాబూరావు. మధుతో పాటు సీపీఎం నేతల అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీపీఎం నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దళితుల సమస్యలను పట్టించుకోకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని సీపీఎం, దళిత, ప్రజా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.

Don't Miss