'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా రివ్యూ

18:43 - January 12, 2017

శతచిత్ర నటుడు బాలకృష్ణ వందో చిత్రంగా రూపకల్పన చేసిన చారిత్రక కథనం గౌతమీపుత్ర శాతకర్ణి. ఒక తెలుగు యుద్ధయోధుని రాజసానికి, శాంతికి, అఖండభారత ఆకాంక్షకు మూలాలను గుదిగుచ్చి వెండితెరపై దృశ్యకావ్యంగా ఆవిష్కరించిన సినిమా ఇది. లోతైన పరిశోధన, సమయోచితమైన,ధీరోదాత్త పాత్రల ఆపాదనతో తీసిన ఈ చిత్రం లో నటీనటులే కాకుండా ప్రతిఫ్రేము వెనుక దర్శకుడు క్రిష్ తపన కూడా కనిపిస్తుంది. హిస్టారిక్ యాక్షన్ డ్రామా తో వచ్చిన ఈ సినిమా కేవలం బాలకృష్ణ అభిమానులకే కాకుండా సినిమా ప్రియులందరికీ కూడా సంక్రాంతి సంబరాన్ని, సందడిని ముందస్తుగానే మోసుకొచ్చేసింది.

కథ విషయానికొస్తే....

ఈ సినిమాలో కథ విషయానికొస్తే ... ముక్కలు ముక్కలుగా, చీలికలు, పేలికలుగా చిన్నాచితక రాజ్యాలతో నిరంతరం యుద్ధాలతో సతమతమవుతుంటుంది భారత దేశం. దేశాన్నంతటినీ ఏకతాటిపైకి తేవాలనుకుంటాడు శాతకర్ణి. అప్పుడే శాంతిని సాధించడం సాధ్యమవుతుందని బాల్యంలోనే కలగంటాడు . దానిని నెరవేర్చుకునేందుకు రణం అనే యుద్ధతంత్రంతో శరణమన్న వాడిని సామంతుడిని చేసుకుంటూ జైత్రయాత్ర సాగిస్తాడు. 32 రాజ్యాలను జయించి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతాడు. అతని యుద్ధ పిపాసకు, రాజ్యకాంక్షకు తద్వారా సాధించే సుస్థిర శాంతికి తల్లి గౌతమి ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. దేశంలో అత్యధిక భాగాన్ని జయించిన తర్వాత విదేశీయులైన యవనుల నుంచి వచ్చే దురాక్రమణ శాతకర్ణికి సవాల్ గా నిలుస్తుంది. దాదాపు తన సైన్యానికి మూడు రెట్లు ఉన్న ఆ విదేశీ మూకలను ఎలా ఎదుర్కొన్నాడు? వారిని తరిమి కొట్టడం ద్వారా దేశ ఖ్యాతిని ఎలా నిలిపాడు అన్నదే క్లైమాక్స్. రాజనీతి, రణనీతి, బీభత్స , భయానక యుద్ధ సన్నివేశాలు, మాతృప్రేమ , కపట మాయోపాయాలు ... కథలో అంతర్భాగంగా సాగిపోయే సంఘటనాత్మక దృశ్యాలు.కథనంలో బిగి ..పట్టు విడవకుండా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. యుద్ధ ఘట్టాలు ఒళ్లు గగుర్పాటు కలిగిస్తాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే....

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయాన్ని తరచి చూస్తే బాలకృష్ణ తన వందో చిత్రానికి 100 పెర్సంట్ న్యాయం చేసేందుకు పాత్రలో పూర్తిగా లీనమయ్యేందుకు కృషి చేశారు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో చారిత్రక చిత్రాలకు తన ఆహార్యం, హావభావాలు చక్కగా సరిపోతాయన్న భావనను నిజం చేసి నిరూపించాడు. సీనియర్ నటి హేమామాలిని గౌతమి పాత్రలో కుమారుడిని తీర్చిదిద్దడంలోనూ, అతని కల నేర్చడంలోనూ, రాజ్యంలో తలెత్తుతున్న అసంతృప్తభావనలకు సరైన రీతిలో బదులు చెప్పడంలోనూ హుందాతో కూడిన పరిణత ప్రజ్ణను తన నటనలో కనబరిచారు. ఒకవైపు భర్త యుద్ధకాంక్ష, మరోవైపు కుమారుడని సైతం పణంగా పెట్టాల్సిన దుస్థితిలో కరుణ రసాత్మకమైన మాతృత్వభావనను ఆర్ద్రపూరితంగా పోషించారు వశిష్టాదేవి పాత్రలో శ్రియాశరణ్. మిగిలిన పాత్రలకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా కథను నడపడంలో , నాయక పాత్ర ఔచిత్యాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లడంలో సందర్భోచితంగా నటీనటులందరూ తమవంతు పాత్రల్లో జీవించారు.

టెక్నీషియన్ల విషయంలో...

టెక్నీషియన్ల విషయంలో నంబర్ ఒన్ మార్కులు దర్శకుడు క్రిష్ కొట్టేస్తాడు. ’అన్ సంగ్‘ హీరోగా తెలుగు వాళ్లకే పెద్దగా తెలియక ఎక్కడో చరిత్ర మూలల్లో పడిపోయిన గౌతమీపుత్ర శాతకర్ణి కథను వెలికి తీసిన ఘనత ఆయనదే. ఎన్నెన్నో దేశాలు, ప్రదేశాలు తిరిగి , గ్రంథాలయాల్లో శోధించి తాళపత్ర, తామ్ర , శిల్ప శాసనాలను పరిశోధించి దొరికిన ఆధారాలకు అందమైన అల్లికను జోడించి ఒక మంచి చలనచిత్రంగా , చారిత్రక దృశ్య కావ్యంగా మలచిన శిల్పి క్రిష్ . అతితక్కువ కాలవ్యవధిలో నిర్మించినా సెట్టింగులు , గ్రాఫిక్స్ విషయంలో కథకు తగ్గ హంగులు సమకూర్చడంలో క్రిష్ చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. ప్రేక్షకుడిని కథతో పాటు భావనా ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో చిరంతన్ భట్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఎస్సెట్ గా నిలిచింది. బాలకృష్ణ అభిమానులు ఆశించే డైలాగుల పదును , అదే సమయంలో కథలో పాత్ర ఔచిత్యం రెంటినీ దృష్టిలో పెట్టుకుని రెండు వైపులా పదునున్న కత్తిలా భాషను పంచ్ లుగా విసరడంలో ..అందులోనూ పౌరుషం ధ్వనింపచేయడంలో రచయిత సాయిమాధవ్ కృతకృత్యుడయ్యాడు. యుద్ధసన్నివేశాల్లో రౌద్రం, వీరరసం, బీభత్సం తొణికిసలాడేలా సాదృశ్యమానం చేయడంలో కెమెరా పనితనం కేక పుట్టిస్తుంది. మొత్తమ్మీద ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులకు పండగే. స్వయంగా బాలకృష్ణకు ఆత్మసంతృప్తినిచ్చే సార్థక చిత్రం . తెలుగు సినీ అభిమానులకు మధురమైన తీయని అనుభూతి. గతకాలపు తెలుగు జాతి వైభవానికి, చరిత్రలోని ఒక పార్శ్వానికి తెరనిండైన సాక్ష్యం.

 

ప్లస్ పాయింట్స్ :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం

పదునైన సంభాషణలు

నేపథ్య సంగీతం

పాత్రోచిత నటన

 

మైనస్ పాయింట్స్ :

కాసింత నిడివి ఎక్కువ

కథావేగానికి బ్రేక్ వేసిన పాటలు

ప్రధానపాత్రలతో పోలిస్తే ప్రతినాయక పాత్రలు తేలిపోవడం

 

మరి '10 టివి' ఇచ్చే రేటింగ్, కత్తి మహేష్, మరియు 10టీవీ న్యూస్ ఎడిటర్ సతీష్ విశ్లేషణలు చూడాలనుకుంటే వీడియోను క్లిక్ చేయండి....

Don't Miss