చెంచు మ్యూజియం ఎక్కడో తెలుసా..?

14:54 - June 29, 2017

 

నాగర్ కర్నూలు : నల్లమల అడవి రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే నల్లమల్ల అడవి తెలంగాణకే వన్నెతెచ్చింది. రకరకాల పక్షులు, జంతువులు... ఉల్లాసపర్చే జలపాతాలు. ఆహ్లాదపరిచే పచ్చనిచెట్లు. అంతేనా... ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఎన్నో పుణ్యక్షేత్రాలు. ఇవన్నీ కలగలిసిందే నల్లమల అటవీ ప్రాంతం. ఈ నల్లమల అటవీ ప్రాంతంలోనే 123 చెంచుపెంటలు ఉండటం మరో విశేషం.

అంతరించిపోతున్న చెంచు జాతి..
ప్రస్తుత సమాజంలో చెంచు జాతి క్రమంగా అంతరించిపోతోంది. మరికొన్ని సంవత్సరాలైతే చెంచుజాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. ఇది గమనించే 2009లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మన్ననూర్‌లో చెంచుల జీవన విధానాలను తెలుపుతూ ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. చెంచులు ఎలా జీవిస్తారు? వారి జీవన పరిస్థితులు ఏమిటి? జంతువులతో ప్రమాదం ఏర్పడితే చెంచులు ఎలా ప్రాణాలు రక్షించుకుంటారు? తేనెపట్టు తీయడంతోపాటు మరెన్నో విషయాలు కళ్లకుకట్టేలా ఈ మ్యూజియంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు.

పాలకుల అలసత్వం...
అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం... చెంచు మ్యూజియం పట్ల శాపంగా మారింది. నాడు ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. మ్యూజియంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. అయినా వాటిని ఇంతవరకు పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. మ్యూజియం నిరాదరణకు గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టే ప్రభుత్వానికి చెంచులపై ఏమాత్రం ప్రేమ ఉందో అర్ధమవుతుందని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... చెంచు మ్యూజియానికి పూర్వవైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

Don't Miss