విజయవాడ మున్సిపల్‌ ఆస్తులు ప్రయివేటు పరం..?

08:26 - May 15, 2018

కృష్ణా : విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాలను ప్రయివేటుకు ధారాదత్తం చేసేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. ఆర్థిక వనరుల సమీకరణ, అభివృద్ధి ముసుగులో బడాబాబులకు స్థలాలను కారుచౌకగా కట్టబెట్టేందుకు స్కెచ్‌ గీస్తున్నారు.  కౌన్సిల్‌ అజెండాలో చేర్చి.. తీర్మానాన్ని ఆమోదింపచేసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. 

విజయవాడ మున్సిపాల్‌ కార్పొరేషన్‌కు చెందిన స్థలాలు, కార్యాలయాలు, ఆస్తులను బడాబాబులకు అప్పగించే చర్యలకు ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది. కౌన్సిల్‌ అజెండాలో ఈ ప్రక్రియను చేర్చి ఆమోదించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. గతంలో నిర్వహించిన మూడు కౌన్సిల్‌ సమావేశాల్లో ఈ అంశం వాయిదా పడుతూ వచ్చింది. మరోసారి కౌన్సిల్‌ సమావేశంలో ఆస్తులను అమ్మే అంశాన్ని చేర్చి ఆమోదించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 

ప్రభుత్వం ప్రయివేటు భాగస్వామ్యం పద్ధతిలో లేదంటే బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో ప్రయివేటు వ్యక్తులకు ఆస్తులను అప్పగించేలా అధికారులు ప్లాన్స్ గీస్తున్నారు. సుమారు 50 కోట్ల ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందులో 22.45 కోట్ల విలుగల 3,712 చదరపు అడుగుల విస్తీర్ణంలోని అతిథి గృహాన్ని, 9.79 కోట్ల విలుగల 4,453 చదరపు అడుగుల స్థలాన్ని, 8.27కోట్ల విలుగల మున్సిపల్‌ క్వార్టర్లను, 8.85 కోట్ల విలుగల జంధ్యాల దక్షిణామూర్తి పాఠశాల ఆవరణను అన్యాక్రాంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే అధికారుల అంచనాల కంటే మార్కెట్‌ ధర ప్రకారం ఈ ఆస్తులన్నీ వందల కోట్ల రూపాయలు ఉంటాయని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.  

మున్సిపల్‌ ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే అంశాన్ని కౌన్సిల్‌లో ఆమోదించేందుకు మూడు సార్లు ప్రవేశపెట్టారు.  అయితే కౌన్సిల్‌ మాత్రం ఈ అంశాన్ని మూకుమ్ముడి వాయిదా వేస్తు వచ్చింది. కార్పొరేషన్ ఆస్తులను రక్షించుకోవాలని, వీఎంసీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్‌లు, ఇతర నిర్మాణాలు చేపట్టాలని, ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వవద్దని అన్ని పార్టీల కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. 

మరోసారి ఈ అంశం తెరమీదకు రావడంతో మున్సిపల్‌ కౌన్సిల్‌తో పాటు ప్రజా ప్రతినిధుల్లోనూ చర్చనీయంగా మారింది. ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వస్తున్నా.. మళ్లీ ఈ అంశాన్ని తీర్మానాల్లో పెట్టాలనే వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏమిటని, విపక్షాలు, అధికారపక్షంలోని పలువురు సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Don't Miss