ఉపాధి పనులకు డబ్బులేవి...?

07:57 - May 20, 2017

హైదరాబాద్ : ఉన్న ఊరిలోనే పనికల్పించి .. వలసలు నివారించడమే లక్ష్యంగా నాటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. వలసలు నివారించడానికి సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథక లక్ష్యం.. తెలంగాణలో నీరుగారుతోంది. ఉపాధి హామీ పథకం కింద కూలీలు చేసిన పనులకు ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయకపోవడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా నెలల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయి. దీంతో ఉపాధి కూలీలు బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నారు.

14 రోజుల్లోపే బిల్లులు చెల్లించాలి
నిబంధనల ప్రకారం పనులు చేసిన 14 రోజుల్లోపే బిల్లులు చెల్లించాలి. కానీ తెలంగాణలో మాత్రం నెలలు గడుస్తున్నా కూలీ పనులే ఇవ్వడం లేదు. తెలంగాణ మొత్తంగా ఇప్పటి వరకు కూలీలకు ప్రభుత్వం 345 కోట్ల రూపాయలు బకాయి పడింది. నాలుగు నెలలుగా వీటిని విడుదల చేయకపోవడంతో కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణలో 31 జిల్లాల్లోని 436 మండలాల్లో దాదాపు 8570 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులను ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకుగాను 56 లక్షల జాబ్‌ కార్డులను జారీ చేసింది. 26 జిల్లాల్లో పనులు చేయడానికి అనుమతులు జారీ చేసింది. ఎండలు దంచి కొడుతుండడంతో ఆయా ప్రాంతాల్లో పనులు మందకొడిగా సాగుతున్నాయి. గత ఆర్దిక సంవత్సరం లక్ష్యానికి మించి ఉపాధి హామీ పనులు సాగాయి. మొత్తంగా 10 కోట్ల పనిదినాల్లో 9 కోట్లకుపైగానే పనిదినాలు ఉపయోగించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫలితంగా 24.3 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు కల్పించింది. వీటిలో లక్షా 5వేల 224 కుటుంబాలు వందరోజుల పని దినాలను పూర్తి చేసుకున్నాయి.

బకాయిలు విడుదల చేయాని కేంద్రం
గతేడాది పథకం అమలు లక్ష్యాన్ని చేరినప్పటికీ అందుకుగాను రాష్ట్రానికి రావాల్సిన 400 కోట్ల రూపాయల ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్‌ నిధులు కేంద్రం విడుదల చేయలేదు. వీటితో కలిపి మొత్తంగా 941 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. దీంతో ఈ ఏడాది జరుగుతున్న ఉపాధి హామీ పనులపై నిధుల కొరత ప్రభావం చూపుతోంది. పెండింగ్‌ నిధుల విడుదల కోసం గత నెలలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రితో భేటీ అయ్యారు. పెండింగ్‌ నిధులను విడుదల చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. అయినా ఇంతవరకు నిధులు విడుదల కాలేదు.కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడానికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయకపోవడంతో కూలీలకు కూలీడబ్బులు అందడం లేదు. దీంతో వారు పూటగడవక నానా ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితేకానీ డొక్కాడని పేదలు.. చేసిన పనికి కూలీ అందక అగచాట్లు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఉపాధి నిధులను వెంటనే విడుదల చేయాలని కూలీలు కోరుతున్నారు.

Don't Miss