ఎట్టకేలకు ఏపీ నాలా బిల్లుకు ఆమోదం

07:17 - January 12, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలంగా వివాదం నెలకొన్న నాలా బిల్లుకు ఎట్టకేలకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం లభించింది. మూడోసారి ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్‌ బిల్లును ఆమోదించారు. దీంతో రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
నాలా బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్‌
వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునే నాలా బిల్లుకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం లభించింది. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉండేందుకు గత ఏడాది నాలా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే భారీ ఎత్తున నాలా రుసుము చెల్లించాల్సి వచ్చేది. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలో నాలా రుసుము 5 శాతం, మిగితా ప్రాంతాల్లో 9 శాతం నాలా రుసుము ఉండేది. నాలా రుసుము ఎక్కువగా ఉండటంతో చాలా మంది వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, వాటిని ఇతర భూములుగా మార్చుకునే సాహసం చేయలేకపోయారు. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం కొత్త నాలా బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లును ఆర్డినెన్స్‌ రూపంలో గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. 
నాలా బిల్లుపై గవర్నర్‌ అభ్యంతరం
రాష్ట్ర ప్రభుత్వం పంపిన నాలా బిల్లుపై గవర్నర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెనక్కి పంపారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నాలా బిల్లును ప్రవేశ పెట్టి, అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత మరోసారి గవర్నర్‌కు పంపారు. రెండోసారి ప్రభుత్వం పంపిన బిల్లు మొదటి బిల్లు మాదిరే ఉండటంతో రెండోసారీ గవర్నర్‌ ఆమోదం తెలపలేదు.
గవర్నర్‌ వివరణ, సూచనలు 
ఈ బిల్లులో కొన్ని అంశాలపై గవర్నర్‌ వివరణ అడగడంతో పాటు కొన్ని సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా నాలా రుసుము చెల్లించిన వెంటనే భూ వినియోగ మార్పిడి చేయడం ఎంతవరకు సబబు అనే అంశాన్ని గవర్నర్‌ లేవనెత్తారు. భూమి మారిన తర్వాత అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది, ఆ భూమి ప్రభుత్వానిదా లేక ఇతర ప్రభుత్వ శాఖల వారిదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. వీటితో పాటు కొత్త నాలా బిల్లు అమల్లోకి వస్తే ఆర్థిక శాఖ కోల్పోయే ఆదాయంపై కూడా గవర్నర్‌ సందేహాలు వ్యక్తం చేశారు. వీటన్నిటిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో గవర్నర్‌ బిల్లుకు ఆమోదం తెలిపారు. 
గవర్నర్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న బీజేపీ ఎమ్మెల్యే
అయితే నాలా బిల్లుకు ఆమోదం తెలిపే విషయంలో గవర్నర్‌ ఆలస్యం చేశారని.. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు బుధవారం ఆరోపించారు. తెలంగాణకు వారం రోజుల్లో నాలా బిల్లు ఆమోదించిన గవర్నర్‌ ఏపీ ప్రభుత్వం పంపిన బిల్లును రెండు సార్లు ఎందుకు వెనక్కి పంపారని ప్రశ్నించారు. మొత్తానికి ప్రభుత్వ విమర్శలతో పాటు రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలా బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

Don't Miss