అంటే 'పవన్' చెప్పినవి అబద్ధాలేనా ?

11:30 - May 28, 2018

శ్రీకాకుళం : జిల్లా ఉద్దానం వ్యాధిగ్రస్థులకు.. గతంలో ఎవరూ చేయని రీతిలో.. తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కునే దిశగా.. రకరకాల కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించింది. ఉద్దానం నుంచి శాశ్వతంగా కిడ్నీ వ్యాధిని తరిమేసేవరకూ తమ ప్రయత్నాలు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ వ్యాధి సమస్య పరిష్కారానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం రిమ్స్‌లో డయాలసిస్‌ యూనిట్లను ప్రారంభించడం ద్వారా తొలి అడుగు వేసినట్లు వెల్లడించింది. దీని వల్ల.. ఉద్దానం ప్రాంత రైతులు.. విశాఖపట్టణం దాకా రెండేసి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఇబ్బంది తప్పిందని వెల్లడించింది. ఆ తర్వాత.. టెక్కలిలో 8, పలాసలో 8, సోంపేటలో 12, పాలకొండలో ఐదు చొప్పున డయాలసిస్‌ మిషన్‌లను ఏర్పాటు చేసి.. రోగులకు వైద్య సేవలను చేరువ చేశామని తెలిపింది. ఇవికాక శ్రీకాకుళం రిమ్స్‌లో 16 డయాలసిస్‌ మిషన్లతో ఉద్దానం కిడ్నీ రోగులకు సేవలందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కిడ్నీ వ్యాధులకు మూల కారణం ఇంత వరకూ తేలనప్పటికి... తాగు నీరే కొంత మేర కారణం కావచ్చని భావించినందు వల్ల.. శుద్ధ జలాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏడు మదర్‌ ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఏడు మండలాల్లో 128 గ్రామాలకు చెందిన లక్షా 89వేల మందికి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని, ఏడు మదర్‌ ప్లాంట్ల పని పూర్తయిందని, 135కు గాను 109 పంపిణీ యూనిట్ల ద్వారా ఇప్పటికే క్యాన్ల ద్వారా నీటిని అందిస్తున్నామని ప్రభుత్వం వివరించింది. ఈ ప్రాంత ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని.. కుప్పంలో నెలకొల్పాల్సిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతిని.. సిక్కోలుకు తరలించినట్లు వెల్లడించింది.

డయాలసిస్‌ చేయించుకునేందుకు ఒక్కొక్కరికి పాతిక నుంచి 30 వేల ఖర్చవుతుందని.. వారానికి ఎన్నిసార్లయినా.. ఉచితంగానే డయాలసిస్‌ సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఆసుపత్రిలో రోజూ 25 నుంచి 27 సెషన్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా ఉద్దానం కిడ్నీ వ్యాధి గ్రస్తులు 363 మందికి.. ప్రతినెలా రెండున్నర వేల రూపాయల పింఛన్‌ ఇస్తున్నామని వెల్లడించింది. డయాలసిస్‌ చేయించుకుంటున్న వారు.. కొన్ని చోట్ల నెఫ్రాలజిస్టును నియమించాలని కోరుతున్నారని, త్వరలోనే దీన్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చింది.

కిడ్నీ వ్యాధులపై పరిశీలనకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ బృందాన్ని రప్పించామని, ఈ బృందం.. విశాఖలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌-విమ్స్‌ కేంద్రంగా, జార్జి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ సీనియర్‌ నెఫ్రాలజిస్ట్‌ డా.వివేకానంద ఝా నేతృత్వంలో పని చేస్తోందని ప్రభుత్వం గుర్తు చేసింది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల మూలాలను కనుగొనే పరిశోధన ప్రారంభమైందని వివరించింది. నిరుడు జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ ఉద్దానం మండలంలో ప్రత్యేక స్క్రీనింగ్‌ కూడా నిర్వహించామని ప్రభుత్వం తెలిపింది. డా.వివేకానంద ఝా నేతృత్వంలో ఉద్దానం ప్రాంతంలోని 18 ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులకు సంబంధిత శిక్షణను అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జూన్ మొదటి వారం నుండి సంబంధిత మందులను రోగులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

Don't Miss