పిడికెడు గుండె కు గుప్పెడు పల్లీలు

12:51 - July 15, 2017

గుప్పెడు పల్లీలతో పిడికెడు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వేరు శనగలు లేదా పల్లీలు రోజూ ఓ గుప్పెడు తింటే చాలు అందమైన ఆరోగ్యం మీ సొంత అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పల్లీలు తింటే ఫ్యాట్ చేరుతుందని, అలర్జీని చాలా మంది వీటిని తినకుండా ఉంటారు. పల్లీలను పరిమితంగా తింటే ఎలాంటి హానీ ఉండదు. ఇంకా మెరుగైనా ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఒక కేజీలో వుండే మాంసకృత్తులో ఉండే పల్లీల్లోనూ లభిస్తాయి. బెల్లం, మేకపాలతో కలిపి వేరు శనగలను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

పల్లీల్లో మోనోశాచురేటెడ్‌, పాలీఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులుంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ప్రత్యేకంగా ఉండే ఒలైక్‌ యాసిడ్‌ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి గుండెకు మేలు చేస్తుంది.

కొన్ని రకాల క్యాన్సర్ల నివరాణలోనూ...

కొన్నిరకాల క్యాన్సర్ల నివారణలోనూ పల్లీలు కీలకంగా పనిచేస్తాయి. వీటిల్లో బీటా సిటోస్టెరాల్‌ అని ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కారకాలను నివారిస్తుంది. ఓ అధ్యయనంలో.. వారంలో రెండుసార్లు పల్లీలు తినేవారిలో.. క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం 27 నుంచి 58 శాతం వరకూ తగ్గుతుందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గర్భిణీలకు మేలు...

గర్భిణులకు పల్లీలు చేసే మేలు అంతాఇంతా కాదు. వీటిల్లో ఫోలేట్‌ కూడా ఉంటుంది. గర్భధారణకు ముందూ తరవాత ఈ ఫోలిక్‌ యాసిడ్‌ అందడం వల్ల..పుట్టబోయే పాపాయిల్లో నాడీ సంబంధ సమస్యలు చాలామటుకూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భిణులు తీసుకోవడం వల్ల పాపాయిలు పుట్టాక కూడా అలర్జీలూ, ఉబ్బసం వచ్చే ఆస్కారం చాలామటుకు తగ్గుతుందని వైద్యులు అంటున్నారు.

పిల్లల ఎదుగుదలలో...

పిల్లల ఎదుగుదలకు మాంసకృత్తులు చాలా అవసరం అవుతాయి. అవి పల్లీల నుంచి సమృద్ధిగా అందుతాయి. వాటిని తరచూ పెట్టడం వల్ల వాళ్ల మెదడు పనితీరు చురుగ్గా మారడమే కాదు.. ఎదుగుదలా బాగుంటుంది.

బరువును అదుపులో ఉంచడంలోనూ...

బరువును అదుపులో ఉంచడంలోనూ ఇవి కీలకంగానే పనిచేస్తాయట. పీచూ, కొవ్వూ, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పల్లీలు కాసిని తిన్నా.. పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అలా ఆకలి తగ్గి.. శరీరానికి అవసరమైన శక్తి అంది.. బరువు తగ్గొచ్చు.

Don't Miss