డీపీఆర్ నుంచి అక్రమాలే

13:07 - September 13, 2017

గుంటూరు : జరుగుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల తీరుపై అధికారపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు. యూజీడీ పనుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా.. నాసిరకంగా పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి యుజిడి ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అడ్డగోలుగా చేపట్టిన పనులపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే ఫిర్యాదు....
సాక్షత్‌ యూజీడీ పనుల్లో అక్రమాలపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో.. జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ రంగంలోకి దిగారు. నగరపాలక సంస్థ అధికారులతో కలిసి నగరంలో ఆకస్మిక పర్యటన చేశారు. పనులు జరిగిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారులపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి..మధ్యలోనే వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులు గుంతలమయంగా, మట్టిదిబ్బలుగా మారితే జనం ఎలా రాకపోకలు సాగిస్తారని ప్రశ్నించారు. కలెక్టర్‌ వరుసగా ప్రశ్నలు సంధించడంతో.. సంబంధిత అధికారులు నీళ్లు నమిలారు. అమరావతి రాజధానిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. క్షేత్రస్తాయిలో పర్యటించిన కలెక్టర్‌.. యూజీడీ పనుల్లో లోసుగులు వున్నట్లు గుర్తించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా.. 100 కీలోమీటర్ల మేర ఉన్న మట్టిరోడ్లలో.. గ్రావెల్ రోడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరులో వెయ్యి కిలోమీటర్లకు గాను..140 కిలోమీటర్లలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తయినట్లు సమాచారం. 140 కిలోమీటర్ల పనులకే అక్రమాలు బయటపడితే.. పనులు మొత్తం పూర్తయ్యేవరకు మరెన్ని కుంభకోణాలు బయటపడతాయో చూడాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నవ్యాంధ్ర రాజధానిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు అక్రమాలకు తావులేకుండా..పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు.   

Don't Miss