ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రోగ్రెస్ రిపోర్టు

20:01 - September 1, 2017

గుంటూరు : అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచిపేరు తెచ్చుకుంటున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ మైనింగ్ విషయంలో చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కున్న ప్లస్ పాయింట్సేమిటి? మైనస్ పాయింట్సేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్టు విశ్లేషణ చూద్దాం.

గురజాల పేరు చెప్పగానే కక్షలు, కార్పణ్యాలు గుర్తుకొస్తాయి. గుంటూరు జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరొందిన గురజాల అపార ఖనిజ సంపదకు నిలయం. సిమెంట్, సున్నపురాయి నిక్షేపాలను తన గర్భంలో దాచుకుంది గురజాల నియోజకవర్గం. వేల కుటుంబాలు ఈ పరిశ్రమలనే నమ్ముకుని జీవిస్తున్నాయి. 

1955లో ఏర్పడ్డ గురజాల నియోజకవర్గంలో ఆరు సార్లు కాంగ్రెస్, అయిదు సార్లు టిడిపి విజయం సాధించాయి. సిపిఐ, కృషిలోక్ పార్టీలు చెరోసారి గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి యరపతినేని శ్రీనివాస్ విజయం సాధించారు. ఇది ఆయనకు 5వ విజయం. 

గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాలు ఈ నియోజకవర్గంలో అంతర్భాగాలు.  2లక్షల 26వేల 376 మంది ఓటర్లున్న గురజాలలో మహిళా ఓటర్లు అధికం. నియోజకవర్గం ఓటర్లలో దాదాపు 44శాతం మంది బిసిలు. 

తాగునీటి సమస్యను పరిష్కరించడం, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం, ఉపాధి కల్పనకు పరిశ్రమలు సాధించడం ఇలా అనేక హామీలిచ్చారు యరపతినేని శ్రీనివాస్. ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ఆయన మంచి మార్కులే సాధించారు. 

ఒకప్పుడు నడవడానికి వీలులేని గ్రామాల్లో ఇప్పుడు సీసీ రోడ్లు కనిపిస్తున్నాయి. తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు సాధించడం చాలావరకు సక్సెస్ అయ్యారు. తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరించే బుగ్గవాగు రిజర్వాయర్ అభివృద్ధికి 450 కోట్ల రూపాయలు సాధించారు. అయితే, పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 

పేద పిల్లల్ల పెళ్లిళ్లకు, చదువులకు సహాయం చేయడం, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి వైద్యం చేయించడం లాంటి సేవా కార్యక్రమాలతో ఆయన గురజాల ప్రజల్లో ఇమేజ్ పెంచుకుంటున్నారు. తన సహాయం కోరి వచ్చినవారికి పార్టీల కతీతంగా సాయం చేస్తారన్న మంచి టాక్ సంపాదించుకున్నారు యరపతినేని శ్రీనివాస్.

అభివృద్ధి, సేవా కార్యక్రమాల విషయంలో గుడ్ విల్ గెయిన్ చేసిన గురజాల ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన అనుచరుల చేత అక్రమ మైనింగ్ చేయిస్తూ, మూడేళ్లలోనే కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రానికి హోంమంత్రి చినరాజప్ప అయితే, గుంటూరు జిల్లాకు హోం మంత్రి యరపతినేని శ్రీనివాస్ అంతా చెప్పుకుంటూ వుంటారు. ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ఏ బదిలీ జరిగినా అది యరపతినేని శ్రీనివాస్  కనుసన్నల్లోనే జరుగుతోందన్నది పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే వినిపించే టాక్. పరిశ్రమల ఏర్పాటుకు చొరవ ప్రదర్శించకపోవడం ఆయనకు మైనస్ పాయింట్ గా పరిణమిస్తోంది. 

గురజాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం, వైసిపికి బలమైన నాయకుడు లేకపోవడం యరపతినేనికి కలిసొచ్చే అంశం. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి వైసిపి అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. 

Don't Miss