హెచ్‌1బీ వీసా పొడిగింపు ఆంక్షలపై అమెరికా వెనుకడుగు

12:22 - January 10, 2018

వాషింగ్టన్ : అమెరికాలోని విదేశీ ఐటీ నిపుణులు... ముఖ్యంగా భారతీయులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకుంది. వేలాది మంది హెచ్..1బీ వీసాదారులను యూఎస్‌ నుంచి వెనక్కి పంపే ప్రతిపాదనలను ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌  సర్వీసెస్‌ విభాగం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో అమెరికాలో శాశ్వత నివానికి అనుమతి ఇచ్చే  గ్రీన్‌ కార్డు కోసం వేచిచూస్తున్న అక్కడి భారతీయ హెచ్..1బీ వీసాదారులకు ఊరట లభిస్తుంది.
వెనక్కి తగ్గిన ట్రంప్‌ ప్రభుత్వం  
అమెరికాలో పనిచేసే విదేశీ వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలు విధించాలన్న నిర్ణయంపై ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వీసా పొడిగింపు నిరాకరించి, వేలాది మంది హెచ్‌1బీ వీసాదారులను బలవంతంగా అమెరికా నుంచి వెనక్కి పంపాలనే నిబంధనను పరిగణలోకి తీసుకోలేదని అమెరికా సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ విభాగం ప్రకటించింది. 
హెచ్‌1బీ వీసా ఎన్నిసార్లైనా పొడిగించుకునే అవకాశం
విదేశీ వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్‌1బీ వీసాల పొడిగింపుకు రెండుసార్లకు పరిమితం చేయాలన్న ప్రతిపాదనలను ట్రంప్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో ఈ వీసాలను ఎన్నిసార్లైనా పొడిగించుకునే అవకాశం కొనసాగుతుంది. విదేశీ వృత్తి నిపుణులను తాత్కాలిక ప్రాతిపదికన అమెరికా రప్పించేందుకు అమెరికా కాంగ్రెస్‌ 2000 సంవత్సరంలో కాంపిటీటివ్‌నెస్‌ ఇన్‌ ట్వంటీఫస్ట్‌ సెంచరీ చట్టం చేసింది. గ్రీన్‌ కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా వీసాను ఎన్నిసార్లైనా పొడిగించుకునే అవకాశం ఈ చట్టంలో ఉంది.  పదిహేడేళ్లుగా అమలవుతున్న ఈ చట్టాన్ని సవరిస్తామని 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ట్రంప్‌ దీనికి సవరణలు ప్రతిపాదించారు. బై అమెరికన్‌, హై అమెరికా విధానాన్ని తీసుకొచ్చి, అమెరికా పౌరులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.  అమెరికా ఐటీ దిగ్గజ సంస్థలతోపాటు, యూఎస్‌ చాంబర్ ఆఫ్ కామర్స్‌ కూడా ఈ సవరణలను వ్యతిరేకించింది. ట్రంప్‌ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అమెరికా వృత్తి నిపుణుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమైంది. వీసా పొడిగింపు ఆంక్షలు అమల్లోకి వస్తే అగ్రరాజ్యం ఆర్థికంగా దివాలాతీసే ప్రమాదం ఉందన్న నిపుణులు హెచ్చరించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌1బీ వీసాల పొడిగింపుపై  ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనలపై వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం వల్ల అమెరికాలో ఉంటున్న దాదాపు 5 నుంచి ఏడున్నర లక్షల మంది  భారతీయులకు ఊరట లభిస్తుంది. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికాలోని విదేశీ వృత్తి నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 

Don't Miss