టి.నేతలపై నీళ్లు చల్లిన హన్సరాజ్...

06:42 - November 24, 2016

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని తేలిపోయింది. రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి హన్సరాజ్‌ ప్రకటన చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉన్నప్పటికీ.. డీ-లిమిటేషన్‌ చట్టం ప్రకారం 2026 వరకు సంఖ్య పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఆశపడుతున్న తెలంగాణ రాజకీయ నేతలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ ప్రకారం అసెంబ్లీ స్థానాల పెంపు కోసం తెలంగాణ రాష్ట్రం ఏమైన ప్రతిపాదనలు పంపిందా ? అని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. నియోజకవర్గాల పెంపు కుదరదని స్పష్టం చేశారు. నియోజకవర్గాలను పెంచాలంటే ఆర్టికల్‌ 371ను సవరించాల్సిన అవసరముందన్నారు. అయితే అది ఇప్పుడు సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి.. నియోజకవర్గాల సంఖ్య పెంపు కుదరదని హన్సరాజ్‌ తెలిపారు.

సీట్లను పెంచాల్సి ఉంది..
అయితే.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. చట్టం ప్రకారం 2026లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం లేదు. దీంతో రాజ్యాంగ ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం అటార్నీ జనరల్‌ సలహా కోరింది. నిబంధనలు అంగీకరించవని అటార్నీ జనరల్‌ కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ పద్ధతులను సూచిస్తూ తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే డీ లిమిటేషన్‌ను 2026 వరకు సీల్‌ చేస్తూ గతంలో పార్లమెంట్‌ చట్టాన్ని ఆమోదించడంతో.. అసెంబ్లీ సీట్ల పెంపునకు అవకాశం లేకుండాపోయింది.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు..
ఇదిలావుంటే.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరని విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాలని రెండు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలతో సంబంధం లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలు పెంచాలని కోరతున్నాయి. రాష్ట్రాన్ని విభజించేందుకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ను వాడుకున్నారో.. అదే ఆర్టికల్‌తో రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలు పెంచవచ్చని ఒత్తిడి తీసుకువస్తున్నాయి. అయితే.. తాజాగా రాజ్యసభలో కేంద్రమంత్రి హన్సరాజ్‌ ప్రకటనతో వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు కష్టమేనని తెలుస్తోంది. మరి ఈ ప్రకటనపై తెలంగాణ రాష్ట్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Don't Miss