డేరాలో ఎన్నో ఘోరాలు...!

21:31 - September 8, 2017

చండిఘర్  : హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్ఛా సౌధా ప్రధాన కార్యాలయంలో భారీ భద్రత నడుమ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. డేరా ఆశ్రమం పరిసరాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా కర్ఫ్యూ విధించారు. 41 కంపెనీల ఆర్మీ జవాన్లు, నాలుగు జిల్లాల పోలీసులు, ఒక ప్రత్యేక పోలీస్ టీం, బాంబ్ స్క్వాడ్ సోదాల్లో పాల్గొన్నాయి. భద్రత అధికారుల తనిఖీల్లో ఐదుగురు అనుమానస్పద యువకులు పట్టుబడ్డారు. ఇందులో ఇద్దరు మైనర్‌ బాలురు. వీరిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

భారీ ఎత్తున పాత కరెన్సీ..
సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా డేరా ఆశ్రమంలో భారీ ఎత్తున పాత కరెన్సీ లభించింది. డేరా సమీప మార్కెట్‌లో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ ప్లాస్టిక్‌ కరెన్సీ దొరికింది. వీటితో పాటు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డేరాలోని కంట్రోల్‌ రూమ్‌తో పాటు మరో మూడు గదులను పోలీసులు సీల్‌ చేశారు. అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు జరిపేందుకు జెసిబి సహాయాన్ని కూడా తీసుకున్నారు. మెటల్‌ డిటెక్టర్‌ సహకారంలో గోడలను తనిఖీ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఫోరెన్సిక్ టీమ్‌ను కూడా ఆశ్రమానికి రప్పించారు. డేరా ఫార్మసీలో అన్‌ బ్రాండెడ్‌, లేబుళ్లు లేని మందులు పెద్దఎత్తున లభించాయి. ఓబీ వ్యాన్‌, నంబరు ప్లేట్‌లేని ఓ కారును అధికారులు గుర్తించారు. డేరా ప్రధాన కార్యాలయంలో విస్తృత తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను అధికారులు నిలిపివేశారు. ఈ నిషేధం సెప్టెంబర్‌ 10 వరకు ఉంటుంది.

అస్తిపంజరాలు...
డేరా క్యాంపస్‌లో అస్తిపంజరాలు ఉన్నాయని డేరా అనుకూల పత్రిక సచ్‌ కహూ పేర్కొంది. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష పడ్డ విషయం తెలిసిందే. బాబా జైలుకు వెళ్లినప్పటినుంచి విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. హరియాణా, పంజాబ్‌లలోని డేరా ఆశ్రమాల నుంచి ఇప్పటికే ఆయుధాలు లభ్యమయ్యాయి.

Don't Miss