కంటతడి పెట్టించి...జాతిని జాగృతి చేస్తున్న వీడియో..

11:06 - November 6, 2018

ఢి్ల్లీ : దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలైపోయింది. ఇళ్లన్నీ దీపాల వెలుగుల్లో కళకళలాడుతున్నాయి. దీపావళి అందరి ఇళ్లలోను వెలుగులను పంచుతోందా? సంపన్నులకేనా దీపావళి. సామాన్యులకు కాదా? అవునే అనిపిస్తోంది నేటి ఆధునిక సమాజం. ఆధునికత మెరుపులకే కాగీ..మేలుకొలుపులకు కాదంటోంది. వెలుగు జిలుగులు దీపాల కొనుగోలులో మట్టి దీపాలు వెల వెలబోతున్నాయి. అవి తయారుచేసేవారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా హెచ్‌పీ ఇండియా సంస్థ ఓ వీడియోను రూపొందించింది. దీపాలు వెలిగించే ప్రమిదలను ఖరీదైన షాపింగ్‌ మాల్స్‌, దుకాణాల్లో కాకుండా వీధుల్లో అమ్మే వారి వద్ద నుంచి కొనుగోలు చేయాలని ప్రజలకు చెప్పడం కోసం హెచ్‌పీ ఈ ప్రకటనను రూపొందించింది. ఈ వీడియోను ‘ఉమ్మీద్‌ కా దియా’ పేరిట హెచ్‌పీ ఇండియా తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

‘మనం వేసే ఒక్క అడుగు ఎందరో జీవితాల్లో మార్పును తెస్తుంది. పండుగకు కావాల్సిన వస్తువులను వీధుల్లో అమ్మేవారి నుంచి కొనుగోలు చేయండి. వాటితో మన ఇంట్లో వెలిగించే దీపాలు వారి నివాసాల్లోనూ వెలుగునిస్తాయి.’ అని హెచ్‌పీ ఇండియా ట్వీట్‌లో పేర్కొంది. వీడియోలో ఓ బాలుడు తన తల్లితో కలిసి దీపావళి షాపింగ్‌ చేయడానికి ఓ మాల్‌కు వెళతాడు. అక్కడ ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మాల్‌ నుంచి బయటికి వస్తుండగా ఆ బాలుడికి రోడ్డు పక్కన ప్రమిదలను అమ్ముతున్న ఓ మహిళ కనబడుతుంది. ఆమె ఫొటో తీస్తాడు. ‘అమ్మా ఇవి కొనుక్కుందాం..’ అని తన తల్లిని అడుగుతాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోదు. పైగా ఆ మహిళను చులకనగా చూస్తుంది. అప్పుడు ఆ మహిళకు బాలుడు ఏ విధంగా సాయం చేశాడు? అన్న విషయమే ఇప్పుడు ఎందరినో మేలుకొలిపింది. సంప్రదాయమే కాదు సహాయానికి ముందడుగు వేయించింది. 
రెండు రోజుల్లో ఈ వీడియోను 20 లక్షల మందికిపైగా వీక్షించారు. ‘ఈ వీడియో నిజంగానే కన్నీరుపెట్టించింది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నెటిజన్ల హృదయాల్ని ద్రవింపజేసిన ఆ వీడియోను మీరూ చూడండి..!
 

Don't Miss