ఆసిఫాబాద్ జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులు

12:51 - July 12, 2018

ఆసిఫాబాద్ : చినుకు పడిందంటే చాలు ఆ ప్రాంతంలో ఉన్న గిరిజన గూడాలు, మారుమూల పల్లెలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అలాంటిది 5 రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా జనజీవనం స్థంబించిపోయింది. గ్రామాలన్నీ వరద నీటితో జలమయం అయ్యాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 

ఐదు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జనజీవనం స్థంభించిపోయింది. భారీ వర్షాలతో జిల్లాలో ఉన్న వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు ఎక్కువగా వచ్చి చేరడంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మహరాష్ట్ర సరిహద్దును ఆనుకొని ఉన్న సిర్పూర్, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్‌ మండలాలలో పెనుగంగా, ప్రాణహిత లాంటి పెద్ద నదులు ప్రవహిస్తుంటాయి. వారం రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ నదులు జలకళను సంతరించుకున్నాయి. పెనుగంగా ప్రవాహం తీవ్రంగా ఉండటంతో సిర్పూర్‌, కౌటాల మండలాల్లో ఉన్న పది గ్రామాల ప్రజల భయాందోళన చెందుతున్నారు. 

చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల్లో ఉన్న ప్రాణహిత నది కూడా నాలుగు రోజులుగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్ర నుండి వచ్చే వరద నీరు సుమారు 30 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుంది. దీంతో పరిసర ప్రాంతాల్లోని 30 గ్రామాల ప్రజలు వరద ముంపు ఎప్పుడు సంభవిస్తుందో తెలీక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. మరో అతి పెద్ద వాగైన పెద్దవాగును ఆనుకొని దాదాపు వంద వరకు ముంపు గ్రామాలున్నాయి. భారీ వర్షాలతో పెద్దవాగును ఆనుకొని ఉన్న పిల్ల వాగులు గ్రామాలనే ముంచేస్తాయి.

బెజ్జూరు మండలంలో కుష్నేపల్లి, సుశ్మీర్‌ వాగులు చిన్నపాటి వర్షాలకే పొంగి పది గ్రామాలకు రాకపోకలను దూరం చేస్తాయి. దహేగాం మండలంలో ఎర్రవాగు ప్రతి సంవత్సరం ఉగ్రరూపం దాల్చుతుంది. ఈ వాగు పొంగితే 11 గ్రామాల ప్రజలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయి. సిర్పూర్‌ మండలం కొలాంగూడ, పాతట్ల గూడ, శివపూర్‌ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. కాగజ్‌నగర్‌, పెంచికల్‌ పేట్‌, కౌటాల, చింతమానేపల్లి మండలాలు వర్షాకాలంలో బాహ్యప్రపంచానికి దూరం కావాల్సిందే. వాగులపై వంతెనలు నిర్మించినప్పటికీ వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వర్షాకాలం వస్తుందంటేనే జంకుతున్నారు. 

Don't Miss