మరోసారి కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు

08:39 - August 10, 2018

కేరళ : కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో 22 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. పలు రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడంతో గేట్లను ఎత్తివేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.
భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం 
కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వరదలు ముంచెత్తడంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇడుక్కి రిజర్వాయర్‌లో నీటిమట్టం బాగా పెరిగిపోవడంతో గేట్లను ఎత్తివేశారు. 26 ఏళ్ల తర్వాత ఇడుక్కి డ్యామ్‌ గేట్లను తెరచినట్లు అధికారులు తెలిపారు. పెరియర్‌ నది ప్రమాదకరస్థాయిలో ప్రవహించడంతో ఇదమలయార్‌ డ్యామ్‌కు చెందిన నాలుగు గేట్లను తెరిచారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అప్రమత్తం
రిజర్వాయర్ల గేట్లు తెరవడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు. రన్‌వే దెబ్బతినే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం నుంచి విమానాశ్రయంలోకి విమానాల రాకను నిలిపివేశారు. వర్షాల కారణంగా రైల్వే సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది.
కొండ చరియలు విరిగిపడి 22 మంది మృతి 
వర్షాలకు పలుచోట్ల కొండ చరియలు విరిగి పడడడంతో 22 మంది మృతి చెందారు. ఇడుక్కి జిల్లాలో 11 మంది, మలప్పురంలో ఐదుగురు, వాయనాద్‌లో ముగ్గురు, కన్నూరులో ఇద్దరు,  కోజికోడ్‌లో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇడుక్కీలోని అడిమాలి పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. వాయనాద్‌, పలక్కడ్, కోజికోడ్‌ జిల్లాల్లో ఒక్కరు చొప్పున గల్లంతయ్యారు. అలప్పు, ఇడుక్కి, వాయినాద్‌, కొల్లాం, మల్లాపురం జిల్లాలను వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్మీ, నేవి, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. కొండ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
భారీ వర్షాలతో తీవ్రం నష్టం : సీఎం పినరయ్ విజయన్ 
కేరళలోని అనేక జిల్లాలలో భారీ వర్షాలు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు. వరద పరిస్థతిని అంచనా వేసేందుకు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మరో రెండు రోజులు పాటు భారీనుంచి, అతి భారీ వర్షాలు కురవన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

Don't Miss