మరో రెండ్రోజులపాటు వర్షాలు

12:49 - July 10, 2018

హైదరాబాద్‌ : జంటనగరాల్లో మరోరెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మూడు, నాలుగు రోజులుగా నగరంలో చిరుజల్లులతోపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఛత్తీస్‌ఘడ్‌, దానిని ఆనుకుని ఉన్న ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 7కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికితోడు తూర్పు, పశ్చిమ జోన్‌లో సుమారుగా 19.0 డిగ్రీల వెంబడి 4.5 కి.మీ. నుంచి 7.6 కి.మీ. మధ్య కొనసాగుతోందని, దీని ప్రభావంతో మరో రెండురోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా నగరంలో సోమవారం ఉదయం, రాత్రి సమయాల్లో ముసురుతో కూడిన చిరు జల్లులు కురిశాయి. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26.3 డిగ్రీలు, కనిష్ఠంగా 22.3 డిగ్రీలుగా నమోదయినట్టు అధికారులు తెలిపారు.

 

Don't Miss