తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి ప్రతాపం..

21:50 - October 14, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుణ ప్రతాపం కొనసాగుతూనే ఉంది. ప్రవాహం పెరగడంతో.. శ్రీశైలం ఏడుగేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని వదులుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో రాయలసీమలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఓవైపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా... మరోవైపు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరి... జలకళను సంతరించుకుంటున్నాయి. మరోవైపు భాగ్యనగరంలో విషాదం చోటు చేసుకుంది. నాలాలో పడి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంకా కురుస్తునే ఉన్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం అధికమవడంతో శ్రీశైలంలో ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి .. నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి 2లక్షల 33వేల 989 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం ఆనకట్ట స్పిల్‌వే ద్వారా లక్షా 67వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు 11వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 24వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1688 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.40 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 211.95 టీఎంసీలుగా నమోదైంది.

భారీ వర్షాలతో రాయలసీమలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కట్టలకు గండ్లు పడి... ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 

కడప జిల్లా బద్వేల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బద్వేల్ డిపోలోకి నీరు చేరడంతో.. డిపోలో పనులకు ఆటంకం ఏర్పడింది. బస్టాండ్‌కు బయట రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు జరగడంతో డిపో నుంచి నీరు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై నీళ్లు నిలవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే పోరుమామిళ్లలో కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసింది. పోరుమామిళ్ల బస్టాండులోకి కూడా నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదురుకున్నారు.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడపకు సమీపంలో ఉన్న బుగ్గవంక ప్రాజెక్ట్‌ నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షం నీటితో ప్రాజెక్ట్‌ నిండిపోయింది. దీంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో 200 క్యూసెక్కుల నీరు చేరుతుండగా... ఒక గేటు ఓపెన్‌ చేసి 150 క్యూసెక్కుల నీటి దిగువకు వదులుతున్నారు. 

భారీ వర్షాలతో కర్నూలు జిల్లాలో హంద్రీనీవా ప్రధాన కాలువకు పత్తికొండ మండలం దూదూకొండ దగ్గర గండిపడింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన కాలువకట్ట.. బలహీనపడింది. కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉంటంతో గండిపడినట్టు తెలుస్తోంది. మరో మూడు చోట్ల కూడా భారీగా గండిపడే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు.

ఇక తెలంగాణలోనూ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జీడిమెట్ల పరిధిలోని మధుసూదన్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కిలోమీటర్‌ దూరంలో గణేష్‌ మృతదేహం లభించింది. 

Don't Miss