ఉత్తరాంధ్రలో నదులు పోటెత్తుతున్నాయి..

16:17 - July 17, 2017

శ్రీకాకుళం : ఒడిశా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో నాగావళికి అకస్మాత్తుగా భారీగా వరద ఉధృతి చేరుకొంటోంది. ఆదివారం నుండి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్పటికే వరద నీరు జాతీయ రహదారులపైకి చేరడంతో రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

వంశధార..నాగావళి నదులు..
ఉత్తరాంధ్ర జిల్లాలోని వంశధార..నాగావళి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాకపోకలకు నిలిచిపోయాయి. భారీగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలో తురాయి చెట్టు వీధి, మండలం వీధుల్లోకి వరద నీరు చేరింది. పాలకొండ డివిజన్ లోని బూర్ఖా రేగడి మండలాల్లో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

సహాయక చర్యలు..
నదులు ఉగ్రరూపం దాలుస్తుండడంతో అధికారులు పరుగులు పెట్టారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం మొదలు పెట్టారు. పాలకొండలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. బామిని ప్రాంతంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే హిర మండలం గొట్టా బ్యారేజ్ లో 21 గేట్లను ఎత్తివేశారు. గడిచిన 24గంటలుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Don't Miss