దంచికొడుతున్న వానలు..

21:44 - July 18, 2017

హైదరాబాద్ : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. వరద ప్రవాహంతో అన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
జోరుగా..
జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌ నిండుకుండను తలపిస్తోంది. ముందు జాగ్రత్తగా 350 నుంచి 400 క్యూసెక్కుల నీటిని హుస్సేన్‌ సాగర్‌ నుంచి దిగువకు వదులుతున్నారు. బేగంపేటలో అత్యధికంగా 47 మిల్లీమీటర్లు , రాజేంద్రనగర్‌లో 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 
జాగ్రత్తలు..
గ్రేటర్‌ పరిధిలోని చెరువులకు గండ్లుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీవర్షాలకు యాదాద్రి భువనగిరిజిల్లాలో మూసీనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలోని పోచంపల్లి, బీబీనగర్‌, మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
ఎడతెరిపి లేకుండా..        
రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. పుల్కల్‌ మండలంలోని సింగూరు ప్రాజెక్ట్‌లోకి వరదప్రవాహం  కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ ప్రస్తుత నీటిమట్టం 18.4 టీఎంసీలుగా ఉంది.  జలాశయంలోకి ఇన్‌ఫ్లో 1813 క్యూసెక్కులు కాగా 392 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.  
నిలిచిన విద్యుత్‌ సరఫరా..
భారీవర్షాలతో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుగ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. కొత్తగూడెం ప్రధానరహదారిపై భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో 23వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి 17 అడుగులకు చేరుకోగా.. ఇటు ఖమ్మంజిల్లాలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీవర్షాలకు ఈదురు గాలులుకూడా తోడవడంతో భారీగా వృక్షాలు విరిడిపడుతున్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి  గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. 
విస్తారంగా..
అటు కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిర్పూర్‌ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్‌, దహేగాం, పెంచికల్‌ పేట మండలాల్లో భారీగా వానలు దంచికొడుతున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో ప్రవహిస్తున్న పెన్‌గంగా నదికి వరదనీరు పోటెత్తుతోంది.  ఆసిఫాబాద్‌ తిర్యాణి, కెరమెరి మండలాల్లోనూ  వానలు జోరుగా కురుస్తున్నాయి.  బంగాళాఖాతంలో వాయుగుండం కారంణంగా మరో 3రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. జోరువానలతో కుంటలు, చెరువులు నిండుకుండల్లా మారుతున్నాయని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పలు జిల్లాల్లో ప్రత్తిపంట వరదనీటిలోకొట్టుకుపోయి నష్టాలపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss