వానలు..జనాలు అతలాకుతలం..

21:23 - July 17, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది.

అల్పపీడనం..
ఏపీలో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. మరో 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు తెలంగాణలోనూ పలుచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మరో 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో కోస్తాఆంధ్రతోపాటు రాయలసీమలోనూ భారీవర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల ఉధృతితో గాలులు వీస్తాయని .. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. గడచిన 24 గంటల్లో ఇచ్ఛాపురం, రామచంద్రాపురంలలో 5 సెం.మీ, కొయ్యలగూడెంలో 4 సెం.మీ, టెక్కలి, తిరువూరు, పాతపట్నం, సోంపేట, చింతూరులో 3 సెం.మీల‌ వర్షపాతం నమోదైంది.

నాగావళి..
అటు నాగావళి నది కొద్దిగా శాంతిస్తోంది. క్రమేణ తోటపల్లి జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గుతోంది. ప్రాజెక్టులో 103.3 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇన్‌ఫ్లో 12,500 క్యూసెక్కులు ఉండగా..ఔట్‌ఫ్లో 10,000 క్యూసెక్కులగా ఉంది. ఎనిమిది గేట్లలో నాలుగింటిని తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు. కూనేరు వద్ద రహదారిపై భారీగా వండ్రుమట్టి పేరుకుపోవడంతో... అధికారులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మరోవైపు, ఒడిశాలో భారీవర్షాలు కురుస్తుండటంతో దిగువప్రాంతాలకు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికపుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తెలంగాణలో..
ఇటు తెంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాజధాని హైదరాబాద్‌లో జోరువానలు కురుస్తున్నాయి. . రోడ్లన్నీ జలమయంగా మారడంతో, వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఖమ్మంలో పట్టణంలోనూ కుండపోతగా కురిసిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. పల్లపు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. పట్టణ పరిసర ప్రాంతాల్లోనూ జోరువానలతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలావుంటే తీవ్ర అల్పపీడనానికి తోడు బంగాళాఖాతానికి నైరుతి దిశలో ఉపరితల ఆవర్తనం వ్యాపించింది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. దక్షిణకోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లు కురుస్తాయిన వాతావరణ కేంద్రం తెలిపింది.

Don't Miss