ఏపీకి హైకోర్టు తరలింపుకు వడివడిగా అడుగులు

12:51 - January 13, 2018

హైదరాబాద్ : ఏపీకి హైకోర్టు తరలింపు కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లేఖతో... ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఐదుగురు సభ్యులతో  బిల్డింగ్‌ కమిటీని నియమించారు. త్వరలో ఈ కమిటీ విజయవాడ, గుంటూరులో పర్యటించి హైకోర్టు భవన స్థల పరిశీలన చేయనుంది. రెండు నగరాల్లో  తాత్కాలిక హైకోర్టుకు అనువైన భవనాలను ఎంపిక చేయనుంది.
హైకోర్టు విభజించాలని పట్టుపడుతున్న తెలంగాణ
విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని. రెండు రాష్ట్రాలకు హైకోర్టు కూడా పదేళ్లపాటు కొనసాగాలని స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదేళ్లలో హైకోర్టు ఏర్పాటు చేసుకునేవరకు ప్రస్తుతమున్న హైకోర్టునే కొనసాగించాలని తెలిపింది. అయినా ఏపీ ప్రభుత్వం మాత్రం అమరావతి రాజధానిగా అక్కడి నుంచే పాలన సాగిస్తోంది. గతేడాది రాష్ట్ర పాలనా వ్యవస్థలో అంతర్భాగమైన  శానస, కార్యనిర్వాహకశాఖలు ఏపీకి తరలిపోయాయి. ప్రధానమైన న్యాయశాఖ మాత్రం హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై... రెండు రాష్ట్రాల కార్యకలాపాలను కొనసాగిస్తోంది. హైకోర్టును విభజించాలని... తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ సర్కార్‌ పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏపీలో శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ నుంచే ఏపీ హైకోర్టు పనిచేసేలా... దానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామంటూ ముందుకువచ్చింది. ఒకేచోట రెండు హైకోర్టులు ఉండడం సాధ్యంకాదని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 
హైకోర్టులు ఏర్పాటు చేసుకునే యోచనలో రెండు రాష్ట్రాలు
ఈ మధ్యకాలంలో రెండు రాష్ట్రాలు ఎవరికి వారు హైకోర్టులు ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనను ముందుకు తీసుకొచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు విభజనపై దృష్టిసారించింది. ఏపీకి హైకోర్టును తరలించే విషయంపై శరవేగంగా చర్యలు ప్రారంభించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌కు.... ఏపీ ప్రభుత్వం  హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన అనువైన భవనాలను పరిశీలన  చేయాలని లేఖ రాసింది. దీనిపై స్పందించిన చీఫ్‌ జస్టిస్‌ ఐదుగురు సభ్యులతో కూడిన బిల్డింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ వారంలో కమిటీ సభ్యులు ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాలతోపాటు మరికొన్ని భవనాలను పరిశీలన చేయనుంది. 
హైకోర్టు కోసం పలు భవనాలను సూచించిన ఏపీ
హైకోర్టు తాత్కాలిక భవనాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, విజయవాడలోని మేథా టవర్స్‌, ఇబ్రహీంపట్నం సమీపంలోని నోవా కాలేజ్‌లు ఉన్నాయి. గుంటూరు నగరంలో ప్రస్తుతం ఉన్న కోర్టు భవనాలు, కలెక్టర్‌ కార్యాలయం, జిల్లా పరిషత్‌, చుట్టుగుంట సెంటర్‌లోని హార్టికల్చర్‌  కార్యాలయ  భవనాలను కూడా కమిటీ సభ్యులు పరిశీలించే అవకాశముంది. 
దేనికి ఆమోముద్ర వేయనున్నారో ?
హైకోర్టు ఏర్పాటుకు విజయవాడ పరిసర ప్రాంతాలు అంత అనుకూలం కాదన్న అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది.  సిబ్బంది అద్దె ధరలు, ట్రాఫిక్‌ సమస్యలు, మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో గుంటూరువైపే కమిటీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కవగా కనిపిస్తున్నాయి. నాగార్జున యూనివర్సిటీ అయితే  విజయవాడ, గుంటూరు నగరాలకు మధ్యస్థంగా ఉన్నందున అందిరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్న అభిప్రాయ వ్యక్తమవుతోంది. మరి కమిటీ సభ్యులు దేనికి ఆమోముద్ర వేయనున్నారో వేచి చూడాలి.
 

Don't Miss