కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్‌.. రోజుకో మలుపు

07:20 - August 11, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్‌.. రోజుకో మలుపు తిరుగుతోంది. సోమవారం నాటికి చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే చెప్పాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేరోజు.. లా సెక్రెటరీతో పాటు.. అసెంబ్లీ సెక్రెటరీకి ఫారం 1 నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు సిద్ధమవుతోంది. 
ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం 
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం పునరుద్ధరణ విషయంలో.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరినీ ఎమ్మెల్యేలుగా పరిగణించాలంటూ.. సింగిల్‌బెంచ్‌ తీర్పునిచ్చిన 61 రోజులకు.. ప్రభుత్వం అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈలోపే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ శివశంకర్‌ నేతృత్వంలో విచారణ సాగుతోంది. తాము దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ విచారణ ఈనెల 16న ఉన్నందున.. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కూడా వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది.. కోర్టును కోరారు. అయితే న్యాయస్థానం దీన్ని తోసిపుచ్చింది. కోర్టు ధిక్కరణకు.. అప్పీల్‌ పిటిషన్‌కు సంబంధం లేదని తేల్చి చెప్పింది. పిటిషన్‌ వేయడానికి సోమవారం వరకు గడువిచ్చింది.
సర్వత్రా ఆసక్తి 
సోమవారం నాడు అసెంబ్లీ కార్యదర్శితో పాటు.. న్యాయశాఖ కార్యదర్శికి ఫారమ్‌ వన్‌ నోటీసులు ఇవ్వనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. మరోసారి గడువు కోరిన ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందించనుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 

 

Don't Miss