చర్లపల్లి జైలు, నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రత

11:37 - August 27, 2018

హైదరాబాద్ : గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌లో ఇవాళ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈనేపథ్యంలో చర్లపల్లి జైలు, నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు వద్ద ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 
2007 ఆగస్టు 25న బాంబు బ్లాస్ట్‌ 
2007 ఆగస్టు 25న ఈ బాంబు బ్లాస్ట్‌ జరిగింది. మొదట సెక్రటేరియట్‌ ఎదురుగా ఉన్న లుంబినీ పార్క్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఐదు నిమిషాలకే కోఠిలోని అత్యంత రద్దీ ప్రదేశమైన గోకుల్‌చాట్‌ బండార్‌లో మరో బాంబు పేలింది.  రెండు ఘటనల్లో 42 మంది మృతి చెందగా.. 70 మందికిపైగా గాయాలు అయ్యాయి. ఈ పేలుళ్ల వెనుక ఇండియన్‌ ముజాహిద్దీన్‌ హస్తం ఉన్నట్టు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. రెండేళ్ల అనంతరం ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పాకిస్తాన్‌ ప్రేరణతో సాగుతున్న ఈ సంస్థకు చెందిన రియాజ్‌ భత్కల్‌, యాసిన్‌ భత్కల్‌, ఇక్భాల్‌ భత్కల్‌ నాయకత్వం వహించినట్టు ఎన్ఐఏ అధికారులు తేల్చారు. నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ.. 11 వందల 25 పేజీల చార్జిషీటు దాఖలు చేసింది. 2 వందల 86 మందిని విచారించిన ఎన్ఐఏ.. 11 మందిపై అభియోగాలు నమోదు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్లపల్లి జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎవరినీ కూడా లోపలికి రానివ్వడం లేదు. ములాఖత్ లకు అనుమతించడం లేదు. మరోవైపు నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్లపల్లి జైలు నుంచి నిందితులను ప్రవేశపెట్టనున్నారు. 

Don't Miss