హింసాత్మకంగా మావోయిస్టుల వారోత్సవాలు...

20:32 - July 28, 2018

విశాఖపట్టణం : మావోయిస్టుల అమరల సంస్మరణ వారోత్సవాలు హింసాత్మకంగా మారాయి. ఇన్ఫార్మర్‌ అనే నేపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రజా ప్రతినిధులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు హింసాత్మకంగా ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం జిల్లా గూడెంకొత్తవీధి మండలం కుంకుమపూడి గ్రామానికి చెందిన జయరాం అనే గిరిజనుడిని ఇన్ఫార్మర్‌ అనే నేపంతో మావోయిస్టులు హత్య చేశారు. నిద్రపోతున్న జయరాంను బయటకు తీసుకు వెళ్లి గొంతు కోశారు. జయరాంను కాపాడేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించగా.. గాల్లోకి కాల్పులు జరిపి దగ్గరకు రావొద్దని హెచ్చరించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌ సరిహద్దు ప్రాంతంలో రెడ్‌ అలర్డ్‌ ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత పోలీస్‌స్టేషన్లకు అదనపు బలగాలను పంపించారు. మావోయిస్టుల నుంచి ముప్పుఉన్న అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు స్వస్థలాలను వదలి వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

మావోయిస్టు వారోత్సవాలను ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కరపత్రాలు, గోడపత్రికలు ఏర్పాటు చేశారు. రెండేళ్ల కిందట అక్టోబర్‌ 24న రామ్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి పేరిట స్తూపాలను నిర్మించి నివాళులర్పిస్తారని సమాచారం. రాష్ట్రంలో మిగతా చోట్ల మావోయిస్టు పార్టీ ప్రభావం లేకపోయినా విశాఖ జిల్లాలో మాత్రం అడపా దడపా మావోయిస్టు పార్టీ తన కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంది. విశాఖ జిల్లాలో మావోయిస్టుల లొంగుబాట్లు, అరెస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినా మావోయిస్టులు చాపకింద నీరులా వారి కార్యకలాపాలను కొన్ని చోట్ల నిర్వహిస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ప్రధానంగా జీకే వీధి, కొయ్యూరు, చింతపల్లి, జీ. మాడుగుల లాంటి ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ సంచారం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా గాలికొండ, కోరుకొండ దళాలు ఈ ప్రాంతాల్లో తిరుతునట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గిరిజనులకు అండగా ఉండాల్సిన మావోయిస్టులు ఇన్ఫార్మర్‌ నెపంతో వారిని హతమార్చడం సరైంది కాదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Don't Miss