ఆ రెండు కీలక అంశాలపై విచారణలో ఏం జరగనుంది?

08:20 - October 9, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం టెన్షన్ నెలకొంది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన  రెండు కీలక అంశాలపై ఆ రోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వ వాదనతో ఏకీ  భవించి పిటిషన్లను తోసి పుచ్చుతుందా లేక.. పిటిషనర్ల వాదనను బలపరుస్తుందా అన్న  ఆందోళన అధికార, ప్రతిపక్షాల్లో నెలకొంది. ఇంతకీ బుధవారం ఏం జరగబోతోంది? ఆ  రెండు కీలక అంశాలేంటి?
ఈనెల 10న బుధవారం తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే ఓటర్ల జాబితా,  అసెంబ్లీ రద్దుపై దాఖలైన 200లకు పైగా పిటిష్లపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఓటరు  జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి లేవనెత్తిన  అభ్యంతరాలపై ఎన్నికల కమిషన్ హైకోర్టుకు కౌంటర్ దాఖలు చేసింది. ఓటరు జాబితా  సవరణ ప్రక్రియ, అభ్యంతరాలతో పాటు పరిష్కరించిన వివరాలను కోర్టుకు  సమర్పించింది. ఈసీ కౌంటర్ పై అభ్యంతరాలుంటే తెలపాలని మర్రి శశిధర్ రెడ్డిని హైకోర్టు  ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదా వేసింది. 
మరోవైపు తెలంగాణ శాసనసభ రద్దును సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ నేత డీకే అరుణ  హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ శాసనసభను రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేశారన్న  ఆమె.. ఐదేళ్లు ఉండాల్సిన సభను రాజకీయ ప్రయోజనాల కోసం మధ్యలోనే  రద్దుచేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. రద్దు చేసే ముందు సభ్యులకు సమాచారం  కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. 
అసెంబ్లీ రద్దుపై కోరుట్ల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు దాఖలు చేసిన  పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వ  చర్యను తప్పుపడుతూ హైకోర్టులో దాదాపు 200 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు  దాఖలయ్యాయి. పదవీకాలం పూర్తికాకుండానే మంత్రిమండలి తమ ఇష్టానుసారంగా  అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యంగ విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అభ్యంతరాలను ఎప్పుడైనా  సమర్పించవచ్చ ఈసీ.. ఈనెల 12 తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితా విడుదల  చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఓటరు జాబితా సహా.. అసెంబ్లీ రద్దుపై హైకోర్టు ఏం తీర్పు  చెప్పనుందనేది ఆసక్తి రేపుతోంది. 

 

Don't Miss