గ్రామాలకు చేరిన హిందుత్వ దాడులు

08:30 - October 12, 2017

జైపూర్ : దేశంలో చోటు చేసుకుంటున్న హిందుత్వ దాడులు పల్లెలకు సైతం విస్తరిస్తున్నాయి. చిన్నపాటి కారణాలకే మైనారిటీలపై దాడులకు దిగుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లా పోకరన్‌లో దేవిస్తోత్రాన్ని సరిగా పాడనందుకు ఓ ముస్లిం యువకుడిని కొట్టి చంపారు. సెప్టెంబర్‌ 27న దాంతల్‌ గ్రామంలో జాగరణ కోసం వచ్చిన జానపద గాయకుడు ఆదమ్‌ఖాన్‌ హత్యకు గురయ్యాడు. దేవీ స్తోత్రాన్ని సరిగా ఆలపించలేదన్న కారణంతో ఓ ఆలయ పూజారి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. స్తోత్రాన్ని పఠించేటప్పుడు తమ శరీరంలో దేవి శక్తి వస్తుందని భోపా సామాజిక వర్గం నమ్మకం. ఆదమ్‌ఖాన్‌ స్తోత్రాన్ని సరిగా పఠించకపోవడం వల్ల తమకు శక్తి ఆవహించలేదన్న కారణంతో భోపా సామాజికవర్గానికి చెందిన పూజారి రమేష్‌ కుమార్ తన సోదరులతో కలిసి దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. రమేష్‌ కుమార్‌ అతని సోదరులను ఆదమ్‌ఖాన్‌ కుటుంబం దోషులుగా పేర్కొంది. దీంతో బాధిత కుటుంబాన్ని చంపేస్తామని రమేష్‌ అతడి సోదరులు బెదిరించడంతో 25 మంది సభ్యుల ముస్లిం కుటుంబాలు గ్రామం విడిచి వెళ్లిపోయాయి. జిల్లా అధికారులు వారికి ఓ పట్టణంలో ఆశ్రయమిచ్చారు.

Don't Miss