హోలీ..చిందులే..చిందులు..

18:53 - March 12, 2017

హైదరాబాద్ : రంగుల కేళీ హోలీ.. మరోసారి తెలంగాణలో సందడి చేసింది. చిన్నపిల్లల దగ్గరి నుంచి ముసలివారి వరకు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. రాజ్‌ భవన్‌లో జరిగిన సంబరాల్లో గవర్నర్ దంపతులతో పాటు... నేతలు పాల్గొని సందడి చేశారు. రాజ్‌భవన్‌లో హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు ప్రారంభించారు. గవర్నర్‌ అందరికీ రంగులు జల్లుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్‌ దంపతులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో హోలీ వేడుకలు కలర్‌ఫుల్‌గా సాగాయి. యువతీయువకులు సహజసిద్దమైన రంగులు పూసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నృత్యాలు చేస్తూ.... ఆటపాటలతో సందడిగా గడిపారు. ఇక టీఆర్‌ఎస్‌ ఎంపీ మల్లారెడ్డి హోలీ వేడుకల్లో మునిగితేలారు. రంగులు చల్లుకుంటూ, డప్పులు వాయిస్తూ ఉత్సాహంగా గడిపారు.

మెదక్..సంగారెడ్డి..సిద్ధిపేట..
మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో హోలీ ఆనందాలు వెల్లివిరిశాయి. సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ హోలీ ఆడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. కాంగ్రెస్‌ సీనియర్‌నేత జగ్గారెడ్డి హోలీ సంబరాల్లో మునిగితేలారు. రామ మందిర్‌ ఏరియాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన అందరికీ రంగులు పూస్తూ ఆనందంగా గడిపారు.

కరీంనగర్ లో..
కరీంనగర్‌ జిల్లాలో హోలీ వేడుకలు మిన్నంటాయి. యువతీయువకుల కేరింతలతో అదరహో అనిపించాయి. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ స్టేడియంలో హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల.. జిల్లా ప్రజలకు హోలీ శుభకాంక్షలు తెలిపారు.

జగిత్యాల..
జగిత్యాల జిల్లాలో హోలీ సంబరాలు హోరెత్తాయి. క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ అనంతశర్మ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. చెడును వదిలి మంచి మనసుతో సమాసమజ నిర్మాణం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ శరత్‌ కోరారు.

ఖమ్మం..కొత్తగూడెం..
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోనూ హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. తెల్లవారుజాము నుంచే చిన్నాపెద్దా రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకున్నారు. డప్పుల దరువుకు లయబద్దంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా హోలీ జరుపుకున్నారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంతు, ఎస్పీ అంబర్‌కిషోర్‌ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ లో..
మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందరికీ రంగులు పూస్తూ ఎంజాయ్‌ చేశారు.

Don't Miss