ఏది అసలు..ఏదీ నకిలీ?..

07:30 - November 20, 2016

విజయవాడ  : పెద్ద నోట్ల రద్దు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న తరుణంలో.. కొత్తగా రెండు వేల రూపాయల కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్‌లోకి నకిలీ రెండు వేల రూపాయలు ప్రవేశించాయి. నకిలీ దందా చేస్తున్న ముఠాలు.. అమాయకులకు నోట్లు అంటగట్టి మోసం చేస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా జరుగుతున్న నకిలీ నోట్ల చలామణి ముఠాలో మోసపోయిన వ్యాపారులు లబోదిబోమంటున్నారు.

జనానికి ముచ్చెమటలు పట్టిస్తున్న నకిలీ నోట్లు
నల్లధనం, నకిలీ నోట్లు భారత్‌ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ.. సమాంతర ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయన్న ఉద్దేశంతో కేంద్రం ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయల కరెన్సీ నోటు ఇప్పుడు జనానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

మార్కెట్‌లోనికి నకిలీ రెండు వేల రూపాయల నోట్లు
బ్యాంకుల్లో పాత కరెన్సీ మార్చుకుంటే రెండు వేల రూపాయల నోట్లే ఎక్కువగా ఇస్తున్నారు. వీటిని మార్చుకోవడం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. మరోవైపు నకిలీ రెండు వేల రూపాయల నోట్లు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి. అచ్చం ఆర్బీఐ జారీ చేసిన నోటు మాదిరిగానే నకిలీ నోట్లు కూడా ఉన్నాయి. అసలు, నకిలీకి తేడా తెలుసుకోలేకపోతే మాత్రం కష్టాలు తప్పవని విజయవాడ కేంద్రంగా జరిగిన ఓ ఘటన రుజువు చేసింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలో కలర్‌ స్కానర్లతో నకిలీ నోట్లు తయారుచేసిన చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు విజయవాడ కేంద్రంగా జరిగిన ఇలాంటిదే మరో ఘటన జనాన్ని కలవరానికి గురి చేస్తోంది.

పదిహేను లక్షల పాత నోట్ల మార్పిడికి యత్నం
వరంగల్‌కు చెందిన ఓ వ్యాపారి తన దగ్గర ఉన్న 15 లక్షల రూపాయల పాత కరెన్సీని మార్చుకునేందుకు విజయవాడకు చెందిన ఓ ముఠాను సంప్రదించాడు. ఎంతపెద్దమొత్తమైనా కమిషన్‌ ప్రాతిపదికపై మార్పిడికి సహకరిస్తామంటూ నమ్మబలికారు. ఇంకేముందుని వరంగల్‌ నుంచి విజయవాడ వెళ్లిన వ్యాపారి... తన దగ్గరున్న 15 లక్షల రూపాయల పాత నోట్లకు ముఠా చేతిలో పెట్టాడు. దీనికి బదులు ఆర్బీఐ జారీ చేసిన కొత్త నోట్లు తమ దగ్గరున్నాయని నమ్మబలికి నకిలీ నోట్లు అంటకట్టారు. ఏది అసలో, ఏది నకిలినో తెలియని ఆ వ్యాపారి... ఇచ్చిన నోట్లు అసలైవేనని నమ్మి సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చాడు. తీరా తన దగ్గర ఉన్నరెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తే... నకిలీవని తేలడంతో మోసపోయానంటూ లబోదిబో మంటున్నాడు. నకిలీ నోట్ల బెడద ఎంత పెద్ద సమస్యగా మారిందో దీనిని అర్థం చేసుకోవచ్చు.

ఒరిజినల్‌ నోట్లలో సెక్యూరిటీ త్రెడ్‌ కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది
మెజెంతా రంగులో ఆర్బీఐ విడుదల చేసిన రెండు వేల రూపాయల నోటు ధగదగా మెరుస్తూ ఉంటుంది. నకిలీ నోట్లకు మెరుపులు ఉండవు. మెజెంతా రంగు డల్‌గా కనిపిస్తూ, వెలవెలపోతుంది. సెక్యూరిటీ ఫీచర్స్‌లో భాగంగా ముద్రించిన సిల్వర్‌ ఫాయిల్‌లో కూడా తేడా ఉంది. ఒరిజినల్‌ నోట్లలో సిల్వర్‌ ఫాయిల్‌ పొర ముద్రించినట్టుగా ఉంటుంది. కానీ వరంగల్‌ వ్యాపారికి బెజవాడ ముఠా అంటగట్టిన నకిలీ నోట్లలో సిల్వర్‌ ఫాయిల్‌ అతికించినట్టుగా ఉంది. అలాగే నోటుపై ఉండే సెక్యూరిటీ త్రెడ్‌లో కూడా తేడా ఉంది. ఒరిజినల్‌ నోటుపై సెక్యూరిటీ త్రెడ్‌ కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ముట్టుకుంటే తెలుస్తుంది. కానీ నకిలీ నోటును తాకినా సెక్యూరిటీ త్రెడ్‌ వేలికి తాకదు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలో కలర్‌ స్కానర్ల సహాయంతో నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

రెండు వేల రూపాయల నోట్లను ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి
రెండు వేల రూపాయల అసలు నోటుకు, నకిలీ నోటుకు తేడా తెలుసుకోవపోతే వరంగల్‌ వ్యాపారిలా ఎవరైనా మోసపోయే అవకాశం ఉంది. తస్మాత్‌ జాగ్రత్త... వ్యాపార, ఇతరేతర లావాదేవీల్లో భాగంగా మీ చేతికి రెండు వేల రూపాయల నోటు వస్తే ఒకటి రెండు సార్లు చూసుకోండి. సిల్వర్‌ ఫాయిల్‌, సెక్యూరిటీ త్రెడ్‌లను క్షణ్ణంగా పరిశీలించండి. సిల్వర్‌ ఫాయిల్‌ నోటుతోపాటు ముద్రించినట్టు లేకపోయినా.... అతికించినట్టు ఉన్నా వెంటనే దానిని తిరస్కరించాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే సెక్యూరిటీ త్రెడ్‌ తాకితే వేలికి తగిలేగా ఉండాలని సూచిస్తున్నారు. అలాలేకపోతే తీసుకోవద్దని చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటించడంతోపాటు నకిలీ నోట్ల చలామణికి సబంధించిన ముఠాల సమాచారం ఉంటే తెలియజేయాలని కోరుతున్నారు. 

Don't Miss