కేరళ అతలాకుతలం...

17:37 - August 10, 2018

ఢిల్లీ : కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య 26కి పెరిగింది. మరికొందరు గల్లంతయ్యారు. కన్నూర్, ఇడుక్కి, వాయినాద్‌, కోజికోడ్, మల్లాపురం జిల్లాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. ఎర్నాకులం, అలపుజా, పలక్కడ్‌ జిల్లాలను కూడా వరదలు ప్రభావితం చేశాయి. రాష్ట్రంలోని 22 రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడంతో గేట్లను తెరచారు. పలు ప్రాంతాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 6 బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆర్మీ, నేవీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. వరదల కారణంగా రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఫోన్‌ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 50 ఏళ్ల చరిత్రలో కేరళలో ఇంత భారీ వర్షం ఎప్పుడూ కురియలేదని అధికారులు చెప్పారు.

Don't Miss