అకాల వర్షాలు..రైతుల గగ్గోలు..

20:33 - March 17, 2017

హైదరాబాద్ : అకాల వర్షాలతో తెలంగాణ రైతులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. వడగళ్ల వానలతో కడగండ్లపాలు అవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు పొలాల్లోనే తడిసి సర్వనాశనం కావడంతో దిగాలుపడ్డారు. దీంతో సాగు కోసం చేసిన అప్పులు తీరేమార్గంలేదంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు హడలిపోతున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఆదిలాబాద్‌, జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గత రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిశాయి. గాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు సైతం కూకటివేళ్లతో పెకలించుకుని నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వేలాది ఎకరాల్లో పంటలు సర్వనాశనమయ్యాయి.

మామిడితోటలకు భారీ నష్టం..
ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షానికి పూర్తిగా తడిచిపోయింది. మామిడి తోటలకు భారీ నష్టం వాటల్లింది. కాయలన్నీ రాలిపోవడంతో అన్నదాతలు దిగులుతో కుంగిపోతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన వర్షాలకు ఈసారి మావిడి భారీ దిగుబడి వస్తోందన్న ఆనందంతో ఉన్న రైతుల ఆశలు అకాల వర్షాలతో ఆవిరయ్యాయి. మార్కెట్‌ యార్డులకు తెచ్చిన కందులు, మక్కలు, జొన్నలు పూర్తిగా తడిచిపోవడంతో చేతికి అందిన పంట నోటికి అందలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్‌-కాగజ్‌నగర్‌లో విద్యుత్‌ తీగలు తెగిపడంలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.

మంచిర్యాల..
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఉపరితల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిర్మల్‌ జిల్లా ముథోల్‌, తానూరు, తాండూరు మండలాల్లో మామిడి, కంది, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. కోతకు వస్తున్న దశలో కాయలు రాలిపోవడంతో జరిగిన నష్టాన్ని తలచుకుని రైతులు దిగులుపడుతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల జిల్లాలను వడగళ్ల వాన ముంచెత్తింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ధర్మపురి, మేములవాడ, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లో కూడా కొద్దిపాటి వర్షం కపడింది. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్పువాడ ప్రాంతంలో వడగళ్ల వానకు వరి, మొక్కజొన్న పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లిలో విద్యుత్‌ తీగలు తెగిపడటంతో విద్యుతాఘాతానికి 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వరావుపేట ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షం పడటంతో మిర్చి, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీవృక్షం కూలి ద్విచక్రవాహనంపై పడటంతో, అది పూర్తిగా ధ్వంసమైంది. పాల్వంచ, దమ్మపేట మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

మహబూబ్ నగర్..
మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో భారీ వర్షానికి పంటలు పూర్తిగా నాశమయ్యాయి. ఈ ప్రాంతంలో 10 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదు అయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మిర్చిపంట సర్వనాశనమైంది. వేసవి తీవ్రత పెరగకముందే ఉములు, పిడగులు, వడగళ్లు, ఈదురుగాలలతో కూడిన వర్షాలు పడుతుండటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఉత్తర కర్నాటక, మహారాష్ట్రలోని మరాట్వాడ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. లక్షద్వీప్‌ నుంచి మహారాష్ట్రలోని విదర్భ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Don't Miss