గోదావరిలో పెరుగుతున్న వరద ఉధృతి

10:14 - July 10, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరంగల్‌, భద్రాద్రిజిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి. చిన్నతరహా జలాశయాల్లో భారీగా వరద చేరుతోంది. గోదావరి ఉపనదులు ప్రాణహిత, కిన్నెరసాని, తాలిపేరుల్లోకి వరద నీరు ఉధృతంగా చేరుతోంది.  తాలిపేరులోకి 7వేల 250 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 73  మీటర్లకు చేరుకోవడంతో రాత్రివరకూ 7గేట్లను రెండడుగుల మేర ఎత్తారు. గోదావరిలోకి 8వేల 900 క్యూసెక్కుల వరదను వదులుతున్నారు. దీంతో దిగువన గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదారి నీటిమట్టం 24 అడుగులకు చేరుకుంది. అటు కడెం ప్రాజెక్టులోకి కూడా 10వేల 730 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో.. దిగువకు భారీగా వరద నీటిని వదలిలేస్తున్నారు.  మరోవైపు  ఓడిశామీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో మరో రెండు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయిన వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

 

Don't Miss