తాగునీటి ఇక్కట్లు..

13:35 - March 10, 2017

కడప : నీటి అవసరాలు వారిని నిద్ర లేకుండా చేస్తున్నాయి. గుక్కెడు మంచినీళ్ల కోసం పెద్దా చిన్నా తేడా లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. చాలీ చాలకుండా నీటిని సరఫరా చేయడంతో ట్యాంకర్ల దగ్గర నీళ్ల కోసం నానా రభస జరుగుతోంది. తాగునీటి అవసరాలు తీర్చేందుకు అధికారులు ఎలాంటి ప్రణాళికలు రచించకపోవడంతో కడప జిల్లాలో జనం ఇక్కట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. 
బిందెడు నీళ్ల కోసం గంటల తరబడి పడిగాపులు... 
బిందెడు నీళ్ల కోసం గంటల తరబడి పడిగాపులు... ఇళ్లూ వాకిలి వదలిపెట్టి ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు.. కుళాయిల వద్ద క్యూలు కట్టి చుక్క చుక్కను ఒడిసిపట్టుకుంటున్న మహిళలు...ఇదీ... కడప జిల్లాలో ఎక్కడ చూసిన తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ప్రత్యక్ష తార్కాణం. ఎండాకాలం ముదురుతున్న కొద్దీ..భూగర్భ జలాలు అడుగంటిపోయి... బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. అరకొరా నీటి వనరులు ఉన్నా... అవి ప్రజల అవసరాలకు  ఏ మాత్రం సరిపోవడం లేదు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వృద్ధులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంటిపిల్లల్ని పట్టుకొని నీళ్లు తెచ్చుకోవడం గగనమవుతోందని మహిళలు ఆవేదన చెందుతున్నారు. 
అడుగంటిన భూగర్భ జలాలు  
భూగర్భ జలాలు అడుగంటి.. గుక్కెడు నీరు లేక గొంతులు ఎండిపోతున్న పరిస్థితి జిల్లాలో సర్వసాధరణంగా మారింది. మంచినీటి కొరత, నీటి కాలుష్యం వల్ల జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలు.. సురక్షిత జలాల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు.  సురక్షిత జలాలను సరఫరా చేస్తామన్న పాలకుల వాగ్ధానాలు ఎక్కడా ఆచరణ రూపం దాల్చడం లేదు. తాగునీటి సమస్యను తీర్చేందుకు నిధులు కేటాయిస్తున్నామని పాలకులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కానీ అవి ఆచరణ రూపం దాల్చిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.  
తీవ్ర వర్షాభావ పరిస్థితులు 
జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు నీటి సమస్యను మరింత ఉధృతం చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటి బోర్లు, బావులు ఎండిపోయాయి. ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు గుంతల కార్యక్రమం సఫలం కాకపోవడంతో నేల మీద పడ్డ చినుకు.. భూమిలోకి ఇంకి వృథాగా పోతోంది. భూగర్భ జల మట్టాలను పెంచేందుకు అనేక కార్యాక్రమాలు చేపడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం... క్షేత్ర స్థాయిలో ఆచరణలో పెట్టడం లేదు.  ఇంటి అవసరాలకు కూడా నీళ్లు అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
అక్రమంగా బోర్లు వేసి నీటిని తోడేస్తున్న వ్యాపారులు  
ప్రజల తాగునీటి అవసరాలను, నీటి కొరతను కొందరు సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అక్రమంగా బోర్లు వేసి నీటిని తోడేస్తున్న కొందరు వ్యాపారులు బావుల్లో పైపులు వేసి మరీ నీటిని తోడి అమ్ముకుంటున్నారు.  అనుమతులు లేకుంబా బోర్లు వేసినా అధికారులు  పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతల అండదండలు, అధికారుల చూసీ చూడని తనంతో కొందరు వ్యాపారులు  అక్రమ నీటివ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లు కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో ట్యాంకరు ధర 500 నుంచి 1000 రూపాయాలు పలుకుతోంది.
అందని మున్సిపాలిటీ పంపిణీ నీరు      
మ‌రోవైపు మున్సిపాలిటీల్లో పంపిణీ చేస్తున్న నీరు చాలామందికి అందడం లేదు. కొన్ని కాలనీల్లో అప్పుడప్పుడు నీటి సరఫరా చేస్తుంటే.. మరికొన్ని కాలనీల్లో అది కూడా లేదు. నీటి మాఫియా అక్రమ వ్యాపారంతో తమ బోర్లు ఎండిపోతున్నాయని రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. పనిచేయకుండా పోయిన బోర్లను కూడా రిపేర్‌ చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
నీటి మాఫియా ఆగడాలను అడ్డుకోవాలి : స్థానికులు 
నీటి మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని, బోర్లను రిపేరు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. తాగునీటి కోసం మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

 

Don't Miss