ఆలస్య...అలసత్వం..

12:49 - January 12, 2017

హైదరాబాద్ : చిన్న పని కోసం చెప్పులు అరిగేలా తిరగాలి.. పైసలు లేనిదే పనులు కావు... జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న తీరుపై సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్‌ అన్న మాటలివి. గ్రేటర్‌ వాసుల సమస్యల పరిష్కారం అవ్వాలంటే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని.. అవినీతి లేని పాలన సాగాలని పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్టుగా గ్రేటర్‌ పరిధిలో సర్కిళ్లను  పెంచింది. అయితే వాటికి అధికారాలు ఇవ్వడంలో.. కార్యాలయాలను ఏర్పాటు చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తోంది. 
గ్రేట‌ర్ ప‌రిధిలో స‌ర్కిళ్ల  పెంపు 
గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న కోటి మంది జ‌నాభాకు మెరుగైన సేవ‌లు అందించాలంటే ప్రస్తుతం ఉన్నపాల‌న‌ను పూర్తిగా మార్చాల‌ని డిసైడ్ చేసింది ప్రభుత్వం. అందులో భాగంగానే గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న స‌ర్కిళ్లను భారీగా పెంచి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి వ‌ర‌కు ప‌నిచేసేలా ప్లాన్‌ చేసింది. అందులో భాగంగానే 18గా ఉన్న గ్రేట‌ర్ స‌ర్కిళ్లను కొద్ది నెలల వ్యవధిలో 30 స‌ర్కిళ్లకు పెంచింది. అందుకు అనుగుణంగా అధికారుల‌ను సిబ్బందిని కేటాయించి సిటిజ‌న్స్ ప‌నులు పెండింగ్ లో ఉండ‌కుండా చూడాలని అధికారుల‌ను ఆదేశించింది ప్రభుత్వం.
ప్రభుత్వ ఆదేశాలు అమ‌లు కావ‌డం లేదు 
ఇంత వ‌ర‌కు భాగానే ఉంది కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు గ్రేట‌ర్ లో అమ‌లు కావ‌డం లేదు. స‌ర్కిళ్ల సంఖ్యను పెంచి మూడు నెల‌లు పూర్తి కావ‌స్తున్నా పూర్తిస్థాయిలో అధికారుల‌ను కేటాయించలేదు.  కొంద‌రు అధికారుల‌ను ట్రాన్స్ ఫ‌ర్ చేసినా ఇప్పటికీ వారు అక్కడ విధుల్లో చేరలేదు. కొన్ని చోట్ల అర‌కొరగా అధికారులు  నియ‌మించ‌బ‌డ్డప్పటికీ కార్యాల‌యాలు మాత్రం పాత ఆఫిసుల్లోనే కొన‌సాగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన స‌ర్కిళ్లకు కొత్త కార్యాల‌యాల‌ను కేటాయించ‌డంలో మాత్రం బ‌ల్దియా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విఫ‌ల‌మ‌య్యారు. 
నలుగురు డిప్యూటి క‌మీష‌న‌ర్లకు అద‌న‌పు బాధ్యతలు 
ఇక అధికారుల కేటాయింపు విష‌యంలోనూ పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం లేదు. నలుగురు డిప్యూటి క‌మీష‌న‌ర్లకు అద‌న‌పు బాధ్యతలు ఇచ్చారు. స‌ర్కిల్ కు ఉండాల్సిన స్టాఫ్ కంటే చాలా మంది త‌క్కువ‌గా ఉన్నా రెగ్యులర్‌  స్టాఫ్‌ మాట ప‌క్కన పెడితే కనీసం కాంట్రాక్టు ఉద్యోగుల‌ను కూడా నియ‌మించ‌లేదు. దీంతో ఉన్న త‌క్కువ మంది సిబ్బందితోనే కొత్త పాత, స‌ర్కిళ్ల అధికారులు ప‌నులు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న చాలా స‌ర్కిల్ కార్యాల‌యాలు ప్రజ‌ల‌కు దూరంగా ఉంటున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన స‌ర్కిళ్లకు ఆయా ప్రాంతాల్లోనే పెద్ద పెద్ద వార్డు ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి. 
కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న నగరవాసులు 
ఎక్కువ స‌ర్కిళ్లు ఎక్కువ మంది అధికారులు ఉంటే ప‌నులు వేగంగా జ‌రిగి ఎలాంటి అవినీతికి తావు ఉండ‌ద‌ని ప్రభుత్వం భావించినప్పటికీ.. ప‌రిస్థితిలో ఎలాంటి మార్పులేద‌నే విమ‌ర్శలున్నాయి. ఎప్పటి లాగే కార్యాల‌యాల చుట్టు చెప్పుల‌రిగేలా తిరుగాల్సి వ‌స్తుందంటున్నారు నగరవాసులు. ఇప్పటికైనా కొత్తగా ఏర్పాటు చేసిన సర్కిళ్లకు పూర్తి స్థాయిలో అధికారులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలందరికి సమీపంలో ఉండే ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నగర వాసులు కోరుతున్నారు. 

 

Don't Miss