మహిళలూ..నిర్భయంగా మెట్రో రైలులో ప్రయాణం...

06:32 - May 8, 2018

హైదరాబాద్ : మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మహిళల భద్రతకు పెద్దపీట వేసింది. అన్ని మెట్రో రైళ్లలో అతివల కోసం ప్రత్యేక కోచ్‌లను కేటాయించింది. ప్రయాణంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మహిళల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సూచనలను పరిగణలోకి తీసుకున్న మెట్రో రైలు యాజమాన్యం వీరి కోసం ప్రత్యేక కోచ్‌లు అందుబాటులోకి తెచ్చింది. ఒక కోచ్‌లో మూడొంతుల భాగాన్ని ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించారు. భవిష్యత్‌లో పూర్తి కోచ్‌ని కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మెట్రో రైళ్లకు ప్రజల నుంచి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఉద్యోగినులు, విద్యార్థినులు, గృహిణులు... ఇలా అందరూ ప్రయాణిస్తున్నారు. పురుషులతో కలిసి మహిళలు ప్రయాణించడం వలన కొన్ని సందర్భాల్లో వేధింపులు తప్పడంలేదు. దీంతో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటి నుంచి మహిళలకు ప్రత్యేకంగా కొన్ని సీట్లు రిజర్వు చేశారు. దీనికి మంచి స్పదన రావడంతో ఇప్పుడు ఒక కోచ్‌లో మూడొంతుల భాగాన్ని మహిళ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. భవిష్యత్‌లో పూర్తి కోచ్‌ కేటాయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మూడు కోచ్‌లతో నడుస్తున్న రైళ్లలో తమకు ప్రత్యేక సౌకర్యం కల్పించడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలేకాదు.. మెట్రో మహిళా ఉద్యోగులు కూడా ఈ సౌకర్యం ఎంతో బాగుందని చెబుతున్నారు. నాగోలు-అమీర్‌పేట-హైటెక్‌ సిటీ కారిడార్‌ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత మధురానగర్‌ స్టేషన్‌ను ప్రత్యేకంగా మహిళల కోసమే కేటాయించాలని నిర్ణయించారు. మహిళలు ఇక నిర్భయంగా మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు. 

Don't Miss