'హైపర్' సినిమా రివ్యూ

19:30 - September 30, 2016

నేను శైలజ తో ఈ సంవత్సరం హిట్టు బోణికొట్టిన రామ్ అదే ఊపులో చేసిన మరో సినిమా హైపర్. అయితే రామ్ తనకు బాగా ఇష్టమయ్యే మాస్ యాక్షన్ జానర్ నే మళ్లీ ఎంచుకొని హైపర్ గా వచ్చాడు. ఇంతకీ రామ్ హైపర్ గా మెప్పించగలిగాడా లేడా.. ? నేడే విడుదల రివ్యూలో చూద్దాం. 
విశ్లేషణ...1 
ఎనర్టిటిక్ స్టార్  రామ్, మాస్ జానర్ లో మంచి కథతో వెళితే ఈపాటికి ఎన్నో హిట్స్ వచ్చి ఉండేవి. లాస్ట్ టైమ్ కందిరీగ తో  అలా వచ్చే హిట్టు కొట్టాడు. ఆ తర్వాత అదే రూట్లో రొటీన్ గా వెళ్లి దెబ్బతిన్నాడు. అయితే  ఈ సారి మాస్ జానర్ నే ఎంచుకొని  కాస్త మంచి కథతో వచ్చాడు. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్  ఈ సినిమాతో రామ్ ను బాగానే పైకిలేపే ప్రయత్నం చేసాడు. అందులో ఆల్మోస్ట్  సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాకోసం మంచి పాయింట్ ను ఎత్తుకున్నాడు. ముప్పైఏళ్లుగా నిజాయితీ గల ప్రభుత్వాధికారిగా విధులు వ్యవహరిస్తున్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కి తండ్రి ని విపరీతంగా ప్రేమించే ఒక కొడుకుంటే, తన తండ్రికి ఏదైనా ఆపదొస్తే ఆ కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నదే ఈ సినిమా థీమ్. ఈ పాయింట్ ను తెరకెక్కించడంలో మంచి మంచి సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. వినోదంతో పాటు, మంచి డ్రామాని కూడా ఎలివేట్ చేసి మంచి మార్కేలేయించుకున్నాడు దర్శకుడు. ఫస్టాఫ్ సరదాగా చాలా ఆసక్తికరంగా సాగుతుంది, సెకండాఫ్ కొంచెం ఓవర్ డ్రామాతో నిండి ఉంటుంది. టోటల్ గా హైపర్ సినిమా బి,సి ప్రేక్షకులకి మాస్ విందే అనిచెప్పొచ్చు. 
కథ...
రిటైర్ మెంట్ కి దగ్గరపడిన నిజాయితీ గల గవర్నమెంట్ ఉద్యోగి నారాయణ మూర్తి .ఆయన్ను ప్రాణంగా ప్రేమించే అతడి కొడుకు సూర్య. తన తండ్రికి చిన్న జ్వరంలాంటిది వచ్చినా అల్లాడిపోతాడు. అలాంటి తండ్రిచేత , ఇల్లీగల్ గా కట్టిన ఒక బిల్డింగ్ విషయంలో ఒక  మినిస్టర్ సంతకం చేయించాలనుకుంటాడు. కానీ నారాయణ మూర్తి నిజాయితీ ఆపని చేయనివ్వదు.  అందుకే ఆయనచేత నయాన్నోభయన్నా సంతకం చేయించాలని ప్రయత్నిస్తాడు మినిస్టర్ . ఆ ప్రోసెస్ లో ఈ విషయం తెలుసుకున్న నారాయణ మూర్తి కొడుకు సూర్య మినిస్టర్ కే వార్నింగిస్తాడు. దాంతో అహం దెబ్బతిన్న మినిస్టర్,  నారాయణమూర్తి కుటుంబాన్ని ఎలా డీల్ చేసాడన్నదే మిగతా కథ.  అయితే ఇందులో సన్నివేశాలన్నిటినీ కొడుకుకి తండ్రి మీద ఉన్న ప్రేమతోనే లింక్ అయి ఉంటాయి. కథ నుంచి డీవియేట్ అయ్యే సీన్స్ ఏమాత్రం కనిపించవు.  ఈ సినిమాకు అదే బలంగా మారింది. చెప్పాల్సిన పాయింట్ ను సూటిగా  డ్రామా తోనూ , కొన్ని ఎమోషన్స్ తోనూ బాగా  చెప్పాడు దర్శకుడు. ఫస్టాఫ్ టెంపోని సెకండాఫ్ కూడా మెయింటెన్ చెయ్యగలిగితే సినిమా ఓ రేంజ్ లో ఉండేది. ఓవర్ డ్రామా వల్ల కొన్ని సీన్లు ఎలివేట్ కాలేదు. బట్..సినిమా మాత్రం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి.
విశ్లేషణ..2
రామ్ పెర్ఫార్మెన్స్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. మంచి పంచ్ డైలాగులతో , మంచి కేరక్టరైజేషన్ త , అతడి కేరక్టర్ ను బాగా డిజైన్ చేసాడు దర్శకుడు. మొత్తానికి రామ్ తన పాత్రను చాలా ఈజ్ తో సమర్ధవంతంగా పోషించాడు. ఇక హీరోయిన్ రాశీఖన్నా గ్లామర్ ఈ సినిమాలో చాలా ఓవర్ డోస్ లో ఉందనిపించింది. రామ్ తండ్రి నారాయణ మూర్తిగా సత్యరాజ్ నటన అద్భుతమని చెప్పాలి. రామ్ తో ఆయన సీన్స్ అన్నీ ఫన్నీగా , అద్భుతంగా సాగుతాయి. ముఖ్యంగా తండ్రి కొడుకుల కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌటయింది. చిన్నప్పటినుంచి తండ్రి మీద కొడుకు కు ఎంతప్రేమో చెప్పే సన్నివేశాలు చాలా సరదాగా ఉన్నాయి.  ఇక ఆఖరిగా చెప్పుకోవాల్సినది మినిస్టర్ గా  రావు రమేష్ పాత్ర. ఆయన మినిస్టర్ గా తన పాత్రను చించి ఆరేసాడు. ముఖ్యంగా ఆయన పలికే డైలాగ్స్  ఫన్నీగానూ, మంచి ఇంటెన్సిటీ తోనూ నిండి ఉంటాయి. ఇక సంగీతం, సినిమాటో గ్రఫీ , నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా మాస్ ప్రేక్షకులే కాదు, తండ్రి కొడుకుల రిలేషన్ బాగా ఎలివేట్ చేయడం వల్ల క్లాస్ పీపుల్ కూడా బాగానే కనెక్ట్ అవుతారు.  
ప్లస్ పాయింట్స్ :
కథ, కథనాలు
రామ్ నటన
సత్యరాజ్, రావురమేష్ నటన
డైరెక్షన్ 
మైనస్ పాయింట్స్ :
కామెడీ లేకపోవడం 
సెకండాఫ్ ఓవర్ డ్రామా 
 

 

Don't Miss