అప్పటి వరకు నటిస్తూనే ఉంటా - వెంకటేష్...

12:55 - July 25, 2016

టాలీవుడ్..ఏ వుడ్ అయినా వారసుల ఎంట్రీ జరుగుతూనే ఉంటుంది. అంటు తండ్రి..ఇటు తనయులు నటిస్తూ అభిమానులను రంజింప చేస్తుంటారు. టాలీవుడ్ లో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, నాగార్జున వారసులు అఖిల్, నాగచైతన్య పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో వెంకటేష్ కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తన తనయుడు 'అర్జున్' వచ్చేదాక నటిస్తూనే ఉంటానని స్వయంగా వెంకీ పేర్కొన్నాడు. మరో పదేళ్లు, ఇరవయ్యేళ్లు లేదా మా అబ్బాయి అర్జున్ వచ్చేవరకూ సినిమాలు చేస్తుంటా అని వెల్లడించాడు.
వెంకటేష్ తాజా చిత్రం 'బాబు బంగారం' ఆడియో కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ మాట్లాడారు. 30 ఏళ్లు ఎలా గడిచాయో తెలియలేదని, ఐదేళ్ల నుంచి సినిమాలు తగ్గిద్దామనుకున్నట్లు పేర్కొన్నారు. కానీ బాబు బంగారం ట్రైలర్ చూసిన తర్వాత 'మరో పదిహేనేళ్ల వరకూ ఎక్స్ పైరీ డేట్స్ ఇచ్చావేంటయ్యా' అని మారుతిని అడిగినట్లు తెలిపారు. మారుతి దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రంలో వెంకటేష్ హీరోగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

 

Don't Miss